ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ వేసిన ప్రభుత్వం అభ్యర్థుల కోరిక మేరకు మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పటికే అర్హత మార్కుల విషయంలో వెనక్కి తగ్గింది. తర్వాత సర్టిఫికెట్ల అప్‌లోడ్ చేయడం కంపల్షన్ కాదని తెలిపింది. ఇప్పుడు స్పోర్ట్స్ కోటా విషయంలో కూడా అదే పంథాను అనుసరించింది. పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఏప్రిల్ 20న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల టైంలో స్పోర్ట్స్ కోటా కింద పోస్టులను భర్తీ చేస్తున్నట్టు చెప్పలేదు. దీంతో చాలా మంది క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో సమావేశమై తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న లోకేష్ స్పోర్ట్స్ కోటాకు కొన్ని పోస్టులు కేటాయిస్తూ ప్రకటన జారీ చేశారు.
ఇప్పటికే విడుదల చేసిన డీఎస్సీతో సంబంధం లేకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ కోసం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ఈ కోటా కింద భర్తీ చేయడానికి 421పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హత కలిగిన క్రీడాకారులకు నేరుగా మూడు శాతం రిజర్వేషన్ కల్పించింది. ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి పరీక్షలు ఉండవని ప్రకటించింది. నేరుగా అర్హుల సర్టిఫికెట్స్ వెరిఫై చేసి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు. ఈ 421 పోస్టుల్లో ప్రభుత్వం జడ్పీ, ఎంపీ పాఠశాలల్లోనే 333 ఉద్యోగాలు ఖాళీగా చూపించారు. మిగతావి వేర్వేరు పాఠశాలల్లో భర్తీ చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ మే 15వరకు ఉంది. జులైలో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఈ దఫా నోటిఫికేషన్‌లో చాలా మార్పులు చేసింది ప్రభుత్వం. ఏ యాజమాన్యం కింద ఉన్న పాఠశాలల్లో ఉద్యోగం కావాలో ముందుగానే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్లు కూడా అప్ లోడ్ చేయమని ముందు చెప్పారు. దీంతో అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. కీలకమైన టైంలో చదువును పక్కనపెట్టి సర్టిఫికెట్ల కోసం కార్యాలయాలు, కాలేజీలు, యూనివర్శిటీల చుట్టూ తిరగడం ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల మంది అభ్యర్థులు ప్రభుత్వానికి తమ గోడు చెప్పుకున్నారు. సమయం వృథా అవుతుందని వాపోయారు. అందరి అభ్యర్థన ఆలకించిన ప్రభుత్వం సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ను ఆప్షన్‌గా చేసింది. అంటే సర్టిఫికెట్లు ఉన్న వాళ్లు మాత్రమే అప్‌లోడ్ చేయాలని, ఇది కచ్చితమైన రూల్ కాదని వెసులుబాటు కల్పించింది. తర్వాతయినా అప్‌లోడ్ చేయవచ్చని సూచించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos