ఏపీలో మరో ఎమ్మెల్సీ పోరుకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే ఖాళీ అయిన రెండు గ్రాడ్యుయేట్, ఓ టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా.. ఇవాళ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. ఇవాళ రాత్రికి వీటి ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ క్రమంలో శాసనమండలిలో మరో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియడంతో వారి రిటైర్మెంట్ పై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సీట్లకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 29న ఏపీ శాసనమండలిలో ఐదుగురు సభ్యులు రిటైర్ అవుతున్నారు. వీరిలో జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, అశోక్‍బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడు ఉన్నారు. వీరి రిటైర్మెంట్, ఎమ్మెల్సీ సీట్ల ఖాళీపై ఇవాళ మండలి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీళ్ల రిటైర్మెంట్ ను మండలి నోటిఫై చేశాకే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో ఈ ఐదు ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమగమైంది. ఇప్పటికే ఈ ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 10 వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. అనంతరం మార్చి 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత 13న నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చు. మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేస్తారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos