ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలకమైన హైవేకు సంబంధించిన పనులు ప్రారంభంకానున్నాయి. పల్నాడు జిల్లాలో కీలకమైన అమరావతితో పాటుగా గుంటూరు ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు పేరేచర్ల - కొండమోడు హైవేను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ రోడ్డు కోసం రూ. 881.61 కోట్లు కేటాయించారు. ఈ హైవే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వారికి కూడా ఉపయోగంగా ఉంటుంది.. భాగ్యనగరానికి త్వరగా వెళ్లొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ రహదారిని జాతీయ రహదారిగా గుర్తించింది. మేడికొండూరు నుంచి బైపాస్ ద్వారా వేములూరిపాడు దగ్గర పేరేచర్ల - కొండమోడు హైవే కలుస్తుంది. అక్కడి నుంచి ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకునేలా పేరేచర్ల దగ్గర పల్నాడు జిల్లా నరసరావుపేట బ్రిడ్జి వరకు 3 కిలోమీటర్ల మేర రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించేందుకు అధికారులు ప్రతిపాదించారు.. దీని కోసం దాదాపు రూ. 50 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనాకు వచ్చారు.
ఈ కొత్త ప్రతిపాదనతో హైదరాబాద్, పల్నాడు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కొండమోడు రోడ్డు మీదుగా రాజధాని అమరావతికి వెళ్లేందుకు ఔటర్ రింగ్ రోడ్డుపైకి వెళ్లేలా ఈ హైవేను అనుసంధానం చేయాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ప్రతిపాదనను కేంద్రం దగ్గరకు తీసుకెళ్లారు. ఇలా చేస్తే అమరావతి నుంచి హైదరాబాద్, పల్నాడు వెళ్లేవారికి.. హైదరాబాద్, పల్నాడు వైపు నుంచి అమరావతి వైపు వచ్చే వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందంటున్నారు.
మరోవైపు అనంతపురం నుంచి అమరావతికి కనెక్టివిటీ కోసం కొత్త నేషనల్ హైవేను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే గుంటూరు నుంచి కర్నూలు రోడ్డులో ఫిరంగపురం నుంచి బైపాస్ నిర్మాణం చేసి పేరేచర్ల-మేడికొండూరు రోడ్డు మధ్యలో అమరావతి ఓఆర్ఆర్‌లో కలిసేలా ప్లాన్ చేశారు. ఈ మేరకు ఇప్పుడు ఉన్న డిజైన్‌లో మార్పులు చేయాలని సూచనలు చేస్తున్నారు. ఇప్పుడున్న డిజైన్ మార్చేసి.. కొండమోడు - పేరేచర్ల రహదారికి ఫిరంగిపురం నుంచి బైపాస్ మార్గాన్ని వేములూరిపాడు దగ్గర అనుసంధానం చేయడంతో పాటు అక్కడి నుంచి అమరావతి ఓఆర్ఆర్‌పైకి వెళ్లేట్లు ఆలోచన చేస్తున్నారు. ఇలా చేస్తే కొండమోడు-పేరేచర్ల హైవే నుంచి ప్రస్తుతం ప్రతిపాదించిన 3 కిలోమీటర్ల అనుసంధాన మార్గం అవసరం ఉండదని.. భూసేకరణ, రోడ్డు నిర్మాణ భారం ప్రభుత్వంపై తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ తాజా ప్రతిపాదనలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos