ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. తూర్పు గోదావరి జిల్లాలో కీలక నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఎస్. రాజీవ్ కృష్ణ టీడీపీలో చేరారు. రాజీవ్ కృష్ణతో పాటు పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా ఆయన బాటలో నడిచారు. వారందరికి మంత్రి నారా లోకేష్ పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీలో చేరడం ఆనందంగా ఉందని.. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానన్నారు రాజీవ్ కృష్ణ.
రాజీవ్ కృష్ణ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు అల్లుడు, పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీకి దూరంగా ఉన్నారు. కొంతకాలానికి మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఆ తర్వాత కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలో పార్టీకి అండగా నిలిచారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా, అధికార ప్రతినిధిగా వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాజీవ్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో రాజీవ్ కృష్ణ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. విజయసాయిరెడ్డి కమ్మ కుల ప్రస్తావన తేవడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘మీపై కొందరు వ్యక్తులు ఆరోపణలు చేశారు. వాటిని సరైన పద్ధతిలో ఖండిస్తూ మిమ్మల్ని మీరు రక్షించుకునే హక్కు మీకు ఉంది. ఆ క్రమంలో ఓ కులాన్ని కించపరుస్తూ మాట్లాడారు. మీపై ఆరోపణలు చేసిన వ్యక్తుల గురించి మాట్లాడండి.. కులం గురించి ఎందుకు? నాతో సహా చాలా మంది కమ్మ కులస్థులు వైసీపీకి, వైఎస్ జగన్ కు సేవ చేస్తున్నాం. మీ వ్యాఖ్యలతో పార్టీలో మేం ద్వితీయ శ్రేణి పౌరులమ న్న భావన కలుగుతోంది. వైసీపీలో కమ్మవాళ్లు ఎవరూ ఉండకూడదు, పార్టీని సమర్థించకూడదన్నది మీ అభిప్రాయమా? ఏ రాజకీయ పార్టీ విజయానికై నా అన్ని కులాల, మతాల, వర్గాల మద్దతు అవసరమన్నది మీకు తెలియనది కాదు. ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుంది’ అంటూ రాజీవ్ కృష్ణ ట్వీట్ చేశారు. అప్పట్లో ఈ అంశం చర్చనీయాంశమైంది.
ఆ తర్వాత రాజీవ్ తన అనుచరులతో సమావేశమయ్యారు.. వైఎస్సార్‌సీపీని వీడాలని వారి నుంచి ఒత్తిడి రావడంతో.. పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధిష్టానంతో చర్చించగా.. చేరికకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రెండు రోజుల క్రితం అధికారికంగా వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి.. ఇవాళ రాజీవ్ కృష్ణ పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. మొత్తానికి వైసీపీ నుంచి బయటికి వెళ్ళిపోతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉండటంతో ఆ పార్టీ అధిష్టానం బెంబేలెత్తిపోతున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos