విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి మరో ముందడుగు పడింది. రాబోయే 25-30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర రవాణా ప్రణాళిక (CMP) తయారీ పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (APMRC), సిస్ట్రా అనే సంస్థతో కలిసి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఈ CMPని తయారు చేసింది. ట్రాఫిక్ రద్దీ, వాహనాల రాకపోకలు, భౌగోళిక పరిస్థితులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. త్వరలో ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఆ తర్వాత డీపీఆర్ ఆమోదం పొందే అవకాశం ఉంది.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో మెట్రో రైలుకు సంబంధించిన పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీసు, కార్పొరేషన్, విమానాశ్రయం, ఆర్టీసీ, రవాణా, సీఆర్డీఏ, ఎన్‌హెచ్‌ఏఐ వంటి ప్రభుత్వ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. సిస్ట్రా సంస్థ ప్రతినిధి CMP గురించి వివరించారు.. అలాగే అధికారుల సలహాలు తీసుకున్నారు. గతంలో CMP తయారు చేసినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల మెట్రో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్లీ కొత్తగా పరిస్థితులను బట్టి CMPని రూపొందించారు. అయితే APMRC ఇప్పటికే రూ.11 వేల కోట్లతో ఒక నివేదికను కేంద్రానికి పంపింది. CMP తయారీ కోసం సిస్ట్రా సంస్థ 443.43 చదరపు కిలోమీటర్ల పరిధిలో అధ్యయనం చేసింది. విజయవాడతో పాటుగా అమరావతి ప్రాంతం, గన్నవరం, మంగళగిరిలో వివరాలు సేకరించారు. మొత్తం 179 జోన్లుగా విభజించి.. వాహనాల రాకపోకలపై స్టడీ చేశారు.
విజయవాడలో కనీసం వాహనాలు పార్క్ చేయడానికి కూడా స్థలం దొరకడం లేదు. ప్రజా రవాణా వాటాను 20శాత నుంచి 40శాతం పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించాలని భావిస్తున్నారు. అలాగే సిటీ బస్సుల సంఖ్యను, స్టాప్‌లను పెంచాలని ప్లాన్ చేస్తున్నారు.. బస్సుల కోసం ప్రత్యేక ట్రాక్‌లను ఏర్పాటు చేస్తారు. అలాగే సీఆర్డీఏ పరిధిలో రవాణా సౌకర్యాలు పెంచాలని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఈమేరకు రెండు మార్గాల్లో సర్క్యులర్ సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఈ రైళ్లను విజయవాడ, గుంటూరు, అమరావతి, నంబూరు, తెనాలి పర్రాంతాలను కలిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఏం జరగబోతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos