అమరావతిలో ఉన్న హైకోర్టులో ఓ బెంచ్ ను రాయలసీమ ప్రాంతంలోని కర్నూలలో ఏర్పాటు చేస్తామని నిన్న ప్రకటించిన కూటమి సర్కార్ ఇవాళ మరో అడుగు వేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది. ఈ మేరకు హైకోర్టు బెంచ్ విభజన కోరుతూ కేంద్రానికి ఓ ప్రతిపాదన చేసింది. దీన్ని ఆమోదించాలని కోరుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపుతోంది.
గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని అప్పట్లో వ్యతిరేకించిన కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఇవాళ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇప్పుడు కేంద్రానికి ఈ తీర్మానం పంపి నిర్ణయం కోరనున్నారు.
కర్నూలులో హైకోర్టు బెంచ్ కోసం ఉద్దేశించిన తీర్మానాన్ని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా రాయలసీమకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. అనంతరం మాట్లాడిన సీఎం చంద్రబాబు.. రాయలసీమలో హైకోర్టు బెంచ్ అవసరాన్ని గుర్తుచేశారు. రాయలసీమకు నాలుగు ఎయిర్ పోర్టులు దగ్గరగా ఉన్నాయని, ఆ ప్రాంతం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇందులో భాగంగానే హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించాలని కోరారు. దీంతో అసెంబ్లీ ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos