ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.... ప్రధాన పార్టీల అధినేతల్లోనే కాకుండా కిందిస్థాయి ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జుల్లో కూడా టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏ నాయకుడికి ఏ పార్టీ షాక్ ఇస్తుందో... వారు ఏ పార్టీలో చేరతారో అనే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం మరోసారి తెర మీదకు వచ్చింది. గతంలోనే ఇలాంటి వార్తలు వచ్చిన సమయంలో మహీధర్ రెడ్డి ఖండించారు. పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా ఆయన టీడీపీలో చేరటం ఖాయమంటూ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పటికే ఉమ్మడి ప్రకాశంలో వైసీపీ అభ్యర్థుల పైన దాదాపు క్లారిటీ వచ్చింది. ఒంగోలుతో పాటుగా జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అప్పగించారు. ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. మాగుంటనే ఎంపీగా కొనసాగించాలని పట్టుబట్టిన బాలినేని తాజాగా బెట్టు వీడి చెవిరెడ్డితో సమావేశమై ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని మిగిలిన స్థానాలకు సీఎం జగన్ అతి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన కూటమి... సీట్ల కేటాయింపు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 12 సీట్లకుగాను 8 చోట్ల అభ్యర్థులు ఖరారయ్యారు. దర్శి స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు ఖరారు అయినట్లు సమాచారం. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, పర్చూరులో ఏలూరి సాంబశివరావు, ఎస్పీ స్థానమైన కొండపిలో డోలా బాల వీరాంజనేయస్వామి తిరిగి పోటీ చేయనున్నారు. మరో ఐదు సీట్లలో కూడా ప్రస్తుత ఇన్‌చార్జులనే బరిలోకి దించాలని నాయకత్వం నిర్ణయించింది. కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం లో కందుల నారాయణరెడ్డి, గిద్దలూరులో ఎం.అశోక్‌రెడ్డి, ఒంగోలులో దామచర్ల జనార్దన్, యర్రగొండపాలెంలో ఎరిక్సన్‌బాబు పోటీ చేయటం ఖాయమైంది. ఇదిలావుండగా... ఇప్పుడు బీజేపీ తో పొత్తు ఖాయమనే ప్రచారం వేళ ... టీడీపీ ఆశావహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఎవరికి సీట్లు దక్కుతాయి ... పొత్తులో భాగంగా ఎవరు నష్టపోవాల్సి వస్తుందనే చర్చ మొదలైంది. దీంతో... ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీ బీజేపీకి కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. మొత్తానికి అన్ని ప్రధాన పార్టీల్లోనూ... ఆయా స్థానాల్లో అభ్యర్థులు ఖరారై బీఫార్మ్ ఇచ్చేవరకు ... ఎవ్వరికీ సీటు గ్యారెంటీ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos