ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఏపీ శాసన సభ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. శాసనసభ , శాసనమండలి సమావేశాల నోటిఫికేషన్‌ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ జారీ చేశారు. నవంబర్ 11వ తేదీ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశం అవుతాయని నోటిఫికేషన్‌లో రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు. సమావేశాల్లో బడ్జెట్ సహా కొన్ని చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకూ ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతేగాకుండా, పలు చట్ట సవరణ బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అలాగే పలు కీలక బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
కాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రూపకల్పన ఇప్పటికే పూర్తయ్యింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఆ మేరకు ఆదాయం సాధ్యాసాధ్యాలపై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తైంది. ప్రజలపై భారం మోపకుండా ఆదాయాన్ని రాబట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. గత వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించింది. మొత్తం రూ.2,86,389 కోట్లకు బడ్జెట్ సమర్పించారు. 2024 ఏప్రిల్ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి మొత్తం 40 గ్రాంట్ల కింద రూ. 1,09,052.34 కోట్లకు గత ప్రభుత్వం శాసనసభ ఆమోదం తీసుకుంది. ఆ తరువాత ఎన్నికలలో జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి జూన్ నెలలో అధికార పగ్గాలను చేపట్టింది.
ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా ఉండటంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జులైలో మరోసారి ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ కు ఆమోదం తీసుకుని, ఆగస్టు మూడు నుంచి నవంబర్ వరకూ నాలుగు నెలల కాలానికి రూ.1,29,972.97 కోట్లతో 40 గ్రాంట్ల కింద రెండో తాత్కాలిక బడ్జెట్‌కు గవర్నర్‌ఆమోదం పొందింది. ఈ నెలతో ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ 11వ తేదీన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.
మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. ప్రతి 3 రోజులకు ఒకసారి మీడియా ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష కూటమి ఉంటాయని.. ప్రతిపక్షం లేనపుడు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని జగన్ కోరారు. సమస్యలు చెప్పనీయకుండా ఉండటానికే ప్రతిపక్ష పార్టీని గుర్తించటం లేదన్నారు. మైక్ ఇస్తే ప్రభుత్వాన్ని ఎండగడతామని భయమని ఆయన అన్నారు. మైక్ ఇవ్వనపుడు అసెంబ్లీకి వెళ్లి ఉపయోగం ఏమి ఉందని అన్నారు. మీడియా సమక్షంలో ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే జగన్ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రతిపక్షంలో కూర్చుని ప్రజల సమస్యలు ప్రస్తావిస్తేనే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం- పరమార్థం ఉంటాయని అన్ని పార్టీల నేతలు అంటున్నారు. అసలు అసెంబ్లీకి వెళ్లకుండానే స్పీకర్ మైక్ ఇవ్వరని ముందుగానే ఆరోపణలు చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos