ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 7 వరకూ జరగనున్నాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఇవాళ బుధవారం జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు బడ్జెట్ సమావేశాలు మొత్తం 17 దినాలు కొనసాగనున్నాయి. అవసరమైతే మరిన్ని రోజులు పొడిగించేందుకు కూడా బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. కాగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ నెల 14న సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆ తరువాత ఫిబ్రవరి 17, 18 తేదీలలో సభలో బడ్జెట్ పై చర్చిస్తారు. 18వ తేదీన సభలో జరిగిన చర్చకు మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిస్తారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఆరు ఆర్డినెన్స్ లకు ఆమోదం తెలపనుంది.
ఈ నెల ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో ఎమ్మెల్యేలకు ఆటల పోటీల నిర్వహణకు బీఏసీలో నిర్ణయం జరిగింది. మార్చి 1,2,3 తేదీల్లో సెలవు ప్రకటించారు. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి 2 గంటల వరకు సభ నిర్వహించనున్నారు. అదే విధంగా తప్పని సరిగా సమావేశాల్లో ప్రతీ రోజు 10 గంటలకు జీరో అవర్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అవసరమైతే పొడిగించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక, సమావేశాల ముగింపు రోజు మార్చి6న అమరావతి లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు స్పీకర్ నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమంతో పాటుగా ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల గురించి సభా వేదికగా ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. తాజా వివాదాలు.. ప్రభుత్వం పైన వస్తున్న విమర్శలకు అసెంబ్లీ నుంచే స్పష్టత ఇవ్వనున్నారు. మెడికల్ కాలేజీలతో సహా... రుషికొండ పైనా సభలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో... ఈ సారి సమావేశాలు మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.
కాగా.. అసెంబ్లీలో ఇకపై ఎలక్ట్రానిక్ అటెండెన్స్ అమల్లోకి రానుంది. అలాగే అసెంబ్లీలో శాసనసభ్యుడు.. తనకు కేటాయించిన స్థానంలో కూర్చుంటేనే అటెండెన్స్ నమోదవుతుంది. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మాత్రమే హాజరు నమోదు కానుందని స్పీకర్ స్పష్టం చేశారు. సభలో సభ్యులు తమ సీటులో కూర్చున్న తరువాత వారి ఫేస్‌ను కెమెరాలు క్యాప్చర్ చేస్తాయన్నారు. ఈ తరహా అటెండెన్స్ కోసం అసెంబ్లీలో ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేసినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వివరించారు.
ఎమ్మెల్యే కెమెరాకు ముఖం చూపించి వెళ్లినా.. హాజరు నమోదు కాదని అసెంబ్లీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సభ్యుడు తప్పనిసరిగా తనకు కేటాయించిన సీటులో కూర్చుంటేనే అటెండెన్స్ నమోదయ్యేలా సాఫ్ట్‌వేర్ రూపొందించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. మరోవైపు గతంలో మాదిరిగా అసెంబ్లీలో సభ్యులు అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్తే కుదరదని అసెంబ్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో వైసీపీ సభ్యులు రిజిస్టర్‌లో సంతకాలు చేసి అనర్హత వేటు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన సంగతి విదితమే. డిజిటల్ అటెండెన్స్ విధానం వల్ల ఇకపై అలా చేయటం కుదరదని అధికారులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos