ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ అంశంపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. అలాగే రైతు భరోసా హామీ, అన్నదాత సుఖీభవ పథకాల అమలు, పలు కంపెనీలకు భూముల కేటాయింపునకు ఆమోద ముద్ర, మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10 శాతం కేటాయింపు తదితర అంశాలపై చర్చించి, కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. మరోవైపు.. కేబినెట్ భేటీ అనంతరం.. మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు మహిళలకు ఉచిత బస్సు పథకంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇప్పటికే కీలక అప్డేట్ ఇచ్చారు. మరో రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతుందని గుడ్ న్యూస్ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ ముందుకు దూసుకెళ్తోందని మంత్రి తాజాగా నాయుడుపేటలో పర్యటించిన సందర్భంగా అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వెనక్కి వెళ్లిన పరిశ్రమలన్నీ తిరిగి మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాయని.. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని మంత్రి తెలిపారు. శ్రీ సిటీని అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని.. సూళ్లూరుపేట నియోజకవర్గానికి రోడ్డు, రవాణా శాఖకు సంబంధించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos