ఏపీ రాజదాని నగరమైన అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ముగిసింది. మొత్తం 21 అంశాలతో కూడిన అజెండాపై కేబినెట్‌లో చర్చించారు. ఇందులో భాగంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా సీఅర్డీఏ 42, 43 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అమరావతిలో 24,276 కోట్ల రూపాయల విలువైన పనులకు పాలనపరమైన అనుమతులిచ్చింది. ఏపీ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు 14 పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే అమరావతి అభివృద్ధికి హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, కేఎఫ్ డబ్ల్యు నుంచి రూ.16 వేల కోట్లు రుణం తీసుకోవడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ రీ సర్వే ప్రాజెక్టుకు సంబంధించి గ్రామ కంఠం భూముల సర్వే కోసం తీసుకున్న 679 సూపర్ న్యుమరి డిప్యూటీ తహసీల్దార్‌లను మరో రెండేళ్లు కొనసాగించేందుకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్ర ఏర్పాటుకు 50 ఎకరాల 20 సెంట్లు భూమి ఇచ్చేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. మంగళగిరి ఎయిమ్స్‌కు అదనంగా 10 ఎకరాల భూమి కేటాయించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇచ్చే అంశం సహా, మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్ ద్వారా వెయ్యి కోట్ల రుణం మంజూరుకు ఆమోదం దక్కింది. వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 10 జిల్లాల్లోని వరద బాధితులకు స్టాంప్ డ్యూటీ మినహాయింపులు చేస్తూ కేబినెట్‌లో ఆమోదం లభించింది. రుణాల రీ షెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపు ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ పనులకు మళ్లీ టెండర్లు పిలిచేందుకు ఆమోదముద్ర వేసింది. అయితే మున్సిపాలిటీ చట్టం 1965లో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలను మంత్రివర్గం తిరస్కరించినట్లు తెలిసింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos