నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఇటీవల జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు భూ కేటాయింపులపై కేబినెట్ పచ్చజెండా ఊపనుంది. రిజిస్ట్రేషన్ విలువల పెంపు సహా కొన్ని కీలకమైన అంశాలపైనా నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ సమావేశాలపైనా చర్చించనుంది. జనవరి 30న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భేటీలో 15 ప్రాజెక్ట్‌లకు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా రూ.44,776 కోట్ల పెట్టుబడులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ఈ ప్రాజెక్ట్‌లకు మంత్రివర్గంలోనూ ఆమోదం తెలియజేయనున్నారు. అల్లూరి జిల్లాలో రూ.14,328 కోట్లతో 2300 మెగావాట్ల ప్రాజెక్ట్‌ను నవయుగ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనతో పాటు అన్నమయ్య జిల్లాలో రూ.10,300 కోట్లతో మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఏర్పాటు చేయనున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌కూ కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కాకినాడ, అనంతపురం, సత్యసాయి, వైఎస్‌ఆర్ జిల్లాలో ఏర్పాటయ్యే ప్రాజెక్ట్‌లను ఆమోదించే అవకాశం ఉంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల ఒకటి నుంచి రాష్ట్రంలో పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలకు ఆమోదం తెలపనుంది. ఉన్నత విద్యామండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేసే అంశం కేబినెట్ ముందుకు రానుంది. అలాగే స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా అమలు చేయనున్న పీ4 విధానాన్ని ఉగాది నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించినందున కేబినెట్‌లో చర్చించనున్నారు. 22A, ఫ్రీ హోల్డ్ భూముల అంశంపై మంత్రివర్గానికి స్టేటస్ నోట్‌ను ఆయా జిల్లాల ఇంఛార్జ్ మంత్రులు ఇవ్వనున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అక్రమాలపై సిట్ విచారణ, సూపర్ సిక్స్‌లో భాగంగా అమలు చేస్తామని ప్రకటించిన కొన్ని పథకాలపైనా చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos