ఏపీకి వాయుగుండం ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతం - ఉత్తర శ్రీలంక మధ్య ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయవ్యంగా కదిలి, 24 గంటల్లో మరింత బలపడి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు కదిలే సూచనలు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో కుండపోత వానలు పడుతున్నాయి. ఇవాళ ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పల్నాడు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు చోట్ల వర్షం పడుతోంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపుగా కదిలే అవకాశం ఉందని... దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని... రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు చెబుతున్నారు. తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు. అత్యవసర సహాయక చర్యల కోసం 1 NDRF, 4 SDRF బృందాలని ప్రభావిత జిల్లాలకు పంపించామని వారు చెబుతున్నారు.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఉన్నతాధికారులు ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున సహాయక చర్యలకు NDRF, SDRF బలగాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించడం జరిగింది. పోలీస్, ఫైర్ శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి జిల్లాల్లో NDRF, SDRF బృందాలను అందుబాటులో ఉంచాలని, ప్రతి జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను ప్రజలకు తెలిసే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ట్వీట్ చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos