ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు అవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ సంబంధిత ఎకో సిస్టం వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎకో సిస్టంతో ప్రాజెక్టులతో పాటు స్థానికులు, అనుబంధ సంస్థలకూ లబ్ధి చేకూరనుందన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 8వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం గురువారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశంలో ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన, పర్యాటక రంగాలకు సంబంధించిన రూ.39,473 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదాన్ని తెలిపింది. పరిశ్రమలు-వాణిజ్య రంగానికి చెందిన 11 ప్రాజెక్టులు, ఇంధన రంగంలో 7, పర్యాటక రంగంలో 3, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కోటి చొప్పున ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. మొత్తం 22 ప్రాజెక్టుల ద్వారా 30,899 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకూ జరిగిన ఎస్ఐపీబీ సమావేశాల్లో 109 ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఇందులో పారిశ్రామిక రంగానికి చెందిన 46 ప్రాజెక్టులు, ఇంధన రంగానికి చెందిన 41 ప్రాజెక్టులు, పర్యాటక రంగంలో 11, ఐటీలో 7, ఫుడ్ ప్రాసెసింగ్ లో 4 పరిశ్రమలకు చెందిన పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టుల విలువ రూ.5,74,238 కోట్లు. ఈ ప్రాజెక్టు ద్వారా 5,05,968 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. పారిశ్రామిక ప్రాజెక్టులకు సమీపంలో రహదారులు, పోర్టులు, ఎయిర్ పోర్టులు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భూములు ఇచ్చిన రైతులు, స్థానికులకు ప్రయోజనం కలిగితేనే సంతోషంగా భూములు ఇవ్వగలుగుతారని పేర్కోన్నారు. భూములు తీసుకున్న ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పర్యాటక ప్రాజెక్టుల విషయంలోనూ సమీకృత ప్రణాళికల్ని అమలు చేయాల్సిందిగా సూచించారు. కేవలం నిర్దేశిత ప్రాజెక్టుకు మాత్రమే పరిమితం కాకుండా అనుబంధంగా కార్యకలాపాలు వచ్చేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ప్రత్యేకించి సర్వీసు సెక్టార్ కూడా వచ్చేలా ప్రాజెక్టులను ఇంటిగ్రేట్ చేయాలని స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో చేపట్టే పర్యాటక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూములను సేకరించి సిద్ధం చేసుకోవాలని అన్నారు.
శ్రీశైలంలో దేవాలయంతోపాటు భారీ నీటి ప్రాజెక్టు కూడా ఉందని ఎక్కువ మంది పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఆస్కారం ఉండేలా సమీకృత పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలన్నారు సీఎం చంద్రబాబు. శ్రీశైలం రహదారి విస్తరణపైనా దృష్టి పెట్టాలని సూచించారు. ఆతిథ్య రంగంలో కేవలం హోటల్ గదులకే పరిమితం కాకుండా అనుబంధ వినోద కార్యకలాపాలు, సేవల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు వచ్చేలా చూడాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎంత మందికి ఉద్యోగాలను కల్పించామో వివరాలు తెలిసేలా ఎంప్లాయిమెంట్ పోర్టల్ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos