ఏపీలో ఇంటర్ మీడియట్ పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్, సెకండియర్ పరీక్షా ఫలితాలను ఇవాళ ఆన్ లైన్ తో పాటు వాట్సాప్ లోనూ ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే వీటిని ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఫలితాల వెబ్ సైట్ తో పాటు ఇతర వివరాలను వెల్లడించారు.
విద్యార్థులు తమ ఫలితాలను https://resultsbie.ap.gov.in లో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చని విద్యామంత్రి నారా లోకేష్ ట్వీట్ లో తెలిపారు. అలాగే, 9552300009 కు మన మిత్ర వాట్సాప్ నంబర్‌కు "హాయ్" అని సందేశం పంపడం ద్వారా ఫలితాలను యాక్సెస్ చేయవచ్చన్నారు. ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షా ఫలితాలు గత దశాబ్దంలో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసుకున్న విషయం మీతో పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.
మొదటి సంవత్సరంలో 70% ఉత్తీర్ణత, రెండవ సంవత్సరం విద్యార్థులు 83% ఉత్తీర్ణత నమోదు చేసారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రభుత్వ నిర్వహణలోని విద్యాసంస్థలలో ఈ మెరుగుదల నమోదు కావడం గొప్ప విషయమని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో, రెండవ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 10 సంవత్సరాల గరిష్ట స్థాయి 69%కి చేరుకుందని లోకేష్ తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47 శాతం వద్ద ఉందన్నారు. ఇది గత దశాబ్దంలో రెండవ అత్యధికమని అన్నారు. ఈ విజయం విద్యార్థులు, జూనియర్ లెక్చరర్ల కృషికి, విద్యా నైపుణ్యం కోసం అందరి ప్రయత్నాలకు నిదర్శనమని లోకేష్ తెలిపారు. ఈసారి విజయం సాధించలేకపోయిన వారు నిరుత్సాహపడకండని లోకేష్ సూచించారు. దీన్ని ఒక మెట్టుగా ఉపయోగించుకోవాలన్నారు. కష్టపడి పనిచేయండి, విజయం దానంతట అదే వస్తుందని, పరీక్ష రాసిన విద్యార్థులు అందరికీ వారి భవిష్యత్ ప్రయత్నాలలో శుభాకాంక్షలు తెలిపారు. నేర్చుకోవడం, అభివృద్ధి చెందడం, విజయం సాధించడం కొనసాగించాలని నారా లోకేష్ పేర్కొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos