ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ర్యాంక్.. తెలంగాణకు రెండవ ర్యాంక్ అని చెప్పుకోవడానికి బాగానే ఉన్నా.. అసలు ఏ విషయంలో ఈ ర్యాంకులు వచ్చాయో తెలిస్తే మాత్రం ప్రజలు, నాయకులు ఖచ్చితంగా సిగ్గుపడాలి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ ( ఏడీఆర్ ) రిపోర్ట్ ప్రకారం తెలుగు రాష్ట్రాలు టాప్ లో నిలిచాయి. ఎన్నికల సమయంలో నేతలు సమర్పించిన ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలలో 45 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది. 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 1,861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.
దేశవ్యాప్తంగా మొత్తం 4123 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 24 మంది సభ్యుల అఫిడవిట్లు సరిగ్గా స్కాన్ చేయలేదని.. వాటి కారణంగా వాటిని విశ్లేషించలేదని ఏడీఆర్ ప్రకటించింది. ఇక మిగిలిన 4092 మంది ఎమ్మెల్యేల్లో 1,861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేల్చింది. దాదాపు ఇది 45 శాతం వరకు ఉండగా .. అందులో 29 శాతం ఎమ్మెల్యేలపై హత్య, హత్యాయత్నం, అపహరణ, మహిళలపై నేరాలు లాంటి తీవ్ర అభియోగాలు ఉన్నట్టు రిపోర్టులో స్పష్టం చేసింది.
ఇక 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధిక కేసులున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఏపీలోని 175 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 138 మందిపై క్రిమినల్ అభియోగాలు ఉన్నాయి. దాదాపు ఇది 79 శాతానికి సమానం. అలానే రెండో స్థానంలో కేరళ, తెలంగాణలు సంయుక్తంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో దాదాపు 69 శాతం మంది ఎమ్మెల్యేలపై కేసులున్నాయి. 66 శాతంతో బీహార్ మూడో స్థానంలో నిలవగా.. 65 శాతంతో మహారాష్ట్ర నాలుగో స్థానం దక్కించుకుంది. ఐదవ స్థానంలో 59 శాతంతో తమిళనాడు ఉంది. చిన్న కేసు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఎలిజిబుల్ కానీ ఈరోజుల్లో.. ప్రజలను పాలించే నాయకులకు మాత్రం ఈ వెసులుబాటు ఎందుకని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా నిలబడాల్సిన నాయకులు పోయి.. కేసులున్న వారే రూలింగ్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఒకప్పుడు రాజకీయాల్లో మచ్చ లేకుండా ప్రజాసేవకే అంకితం అయిన నేతలు ఉంటే ఇప్పుడు మాత్రం ఈ పరిస్థితి ఏర్పడిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos