తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా హిందూపురంలో పర్యటిస్తోన్నారు. ఇటీవలే ఆయన హిందూపురానికి వచ్చారు. మూడు రోజులుగా నియోజకవర్గంలో కలియతిరుగుతున్నారు. మండలస్థాయిలో ఆయన పర్యటన సాగుతోంది. ప్రజలతో ముఖాముఖి సమావేశమవుతున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను కలుసుకుంటున్నారు.
ఇవాళ ఉదయం ఆయన కిరికెర గ్రామానికి వెళ్లి... స్థానికులను కలుసుకున్నారు. బసవనపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ లో విద్యార్థులతో ముచ్చటించారు. తాను నటించిన సినిమాలు సమాజానికి మంచి సందేశాలను ఇస్తాయని, సందేశాత్మక సినిమాలను ఆదరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి సినిమాల గురించి ప్రస్తావించారు. హిందూపురం నుంచి బాలయ్య కారులో కిరికెర గ్రామానికి వెళ్లేటప్పుడు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బాలయ్యను మంత్రిపదవిలోకి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు, ఆయన అభిమానులు డిమాండ్ చేశారు. రోడ్డుకు ఇరువైపులా నిల్చుని ప్లకార్డులను ప్రదర్శించారు. బాలయ్య బాబు మంత్రిపదవిని తీసుకోవాలనేది అభిమానుల కోరిక అని రాసి ఉన్న ప్లకార్డులు అవి. ఆయనను మంత్రిగా చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కోరుకుంటున్నారని అన్నారు.
బాలకృష్ణకు మంత్రి పదవిలో చోటు కల్పించాలని నినాదం చేస్తూ కనిపించారు. జై బాలయ్య అంటూ గట్టిగా నినదించారు. వాటిని చూసి ఆయన కారు నుంచి కిందికి దిగారు. వారితో కొద్దిసేపు మాట్లాడుతూ దేనికైనా సమయం వస్తుందని బదులిచ్చారు. వారికి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు. ఆ సమయంలో కూడా వారు కారుకు అడ్డుగా నిల్చోవడంతో పోలీసులు నచ్చజెప్పారు. వరుసగా మూడుసార్లు బాలయ్యను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని, ఆయనను మంత్రిగా చూడాలనేదే తమ కోరిక అని అభిమానులు తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos