పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా .. పాకిస్థాన్ గడ్డ మీదకు ప్రవేశించి.. అక్కడున్న ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసిన భారత సైనికుల సాహసాన్ని, ధైర్యాన్ని యావత్ దేశం వేన్నోళ్లా కొనియాడుతోంది. కశ్మీర్ అందాలను చూడటానికి వెళ్లిన అమాయక పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రమూకలకు సరైన సమాధానం చెప్పిందని అభినందిస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడిలో ఏపీకి చెందిన వ్యక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. అందులో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ కూడా ఉన్నారు.
పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం ప్రతీకార చర్యలపై మధుసూదన్ కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ చర్యను స్వాగతించిన మధుసూదన్ కుటుంబసభ్యులు.. ఉగ్రవాదుల చేతిలో మరో ప్రాణం పోకుండా.. ఉగ్రవాదులు అనే వారు లేకుండా గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. ఎన్ని యుద్ధాలు చేసినా.. పోయిన తన కొడుకును తిరిగి తెచ్చివ్వలేరంటూ మధుసూదన్ తల్లి పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. తనలా మరో తల్లి కడుపు కోతకు గురికాకుండా ఉగ్రవాదులను అంతం చేయాలని కోరారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న అన్నను కోల్పోయామని మధుసూదన్ సోదరి విజయలక్ష్మి అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ సిందూర్ తమ కుటుంబానికి ఊరట కలిగిస్తోందని అన్నారు. అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కోరారు.
నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్‌రావు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. వేసవి సెలవులు కావటంతో కశ్మీర్ అందాలను చూద్దామని పహల్గాం వెళ్లారు. అయితే అనుకోకుండా జరిగిన ఉగ్ర దాడిలో మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారు. కావలిలోని కుమ్మరవీధిలో మధుసూదన్ తల్లిదండ్రులు తిరుపాల్, పద్మావతి నివాసముంటున్నారు. మధుసూదన్12 ఏళ్ల క్రితమే బెంగళూరులో స్థిరపడ్డారు. మరోవైపు మధుసూదన్‌తో పాటుగా విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి కూడా పహల్గాం ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos