వైఎస్సార్ జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం అటవీ, డీకేటీ భూములు ఆక్రమించిందనే ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. సజ్జల కుటుంబ ఎస్టేట్‌లోని భూముల్లో అటవీ భూములెన్నో నివేదిక ఇవ్వాలని కడప కలెక్టర్‌ను ఆదేశించారు. వైఎస్సార్ జిల్లా సీకేదిన్నె మండలంలోని సుగాలిబిడికి గ్రామం వద్ద దాదాపు 200 ఎకరాల్లో సజ్జల ఎస్టేట్ ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో సకలశాఖా మంత్రిగా పెత్తనం చెలాయించిన సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు సజ్జల దివాకర్ రెడ్డి కుమారుడైన సందీప్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు బినామీ పేర్లతో వందల ఎకరాలు పట్టా భూములు, డీకేటీ భూములు కొనుగోలు చేశారు. ఇందులో కొన్ని అటవీ భూములు, డీకేటీ భూములను కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి.
వైఎస్సార్సీపీ హయాంలో కడప డీఎఫ్‌ఓగా పనిచేసిన అధికారిని అడ్డుపెట్టుకుని పట్టా భూముల్లోకి అటవీ భూములను కలిపేసుకుని లీగలైజ్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సజ్జల ఎస్టేట్ భూములకు కంచె, పెద్దపెద్ద గేట్లు పెట్టి లోపలికి ఎవర్నీ అనుమతించడంలేదు. ప్రధాన గేటుకు ఎదురుగా సర్వేనంబర్ 1612లో 5 ఎకరాల 14 సెంట్ల చుక్కల భూమి ఉంది. ఇందులో సుగాలిబిడికి గ్రామానికి చెందిన రాజానాయక్ భార్య బుక్కే దేవి పేరిట ఎకరా 34 సెంట్లు, బుక్కే ముత్యాలమ్మ పేరిట ఎకరా 30 సెంట్ల డీకేటీ పట్టాను 1993లో ప్రభుత్వం అందజేసింది. నాటి నుంచి బాధితులు ఆ పొలంలో మామిడిచెట్లు, ఇతర వ్యవసాయ పంటలు సాగు చేసుకుంటున్నారు. తన రెండున్నర ఎకరాలను సజ్జల ఎస్టేట్‌లో కలిపేసుకున్నారని, నోరెత్తితే చంపేస్తామని బెదిరించినట్లు రాజానాయక్ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు గతంలో ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్‌కూ మొరపెట్టుకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకుని చాలామంది డీకేటీ పట్టా భూములను సజ్జల ఎస్టేట్‌లో కలిపేసుకున్నారనే ఆరోపణలున్నాయి.
ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఉపముఖ్యమంత్రి పవన్ కడప కలెక్టర్‌ను ఆదేశించారు. ఏ మేరకు అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయి, అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి.. వన్య ప్రాణులకు ఏమైనా హాని కలిగిందా అనే వివరాలు సమర్పించాలన్నారు. అటవీ భూముల సంరక్షణకు చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని పవన్ ఆదేశించారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారులు ఈ విషయంపై నివేదిక సమర్పించగానే పవన్ కల్యాణ్‌కు కలెక్టర్ వివరాలు అందిస్తారని తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos