ఏపీలోని నెల్లూరు కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారింది. నెల్లూరు మేయర్ పీఠం కోసం కొద్ది రోజులుగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం నెల్లూరు మేయర్ పదవి కైవసం చేసుకునేందుకు కొత్త ప్రణాళికలు సిద్దం చేసింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కార్పొరేటర్లు తిరిగి వైసీపీలోకి వెళ్లారు. దీంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో మేయర్ రాజీనామా చేసారు. ఇక.. టీడీపీ నుంచి కొత్త మేయర్ ఖరారయ్యారు. మాజీ మంత్రి అనిల్ కు చెక్ పెట్టే వ్యూహంతో టీడీపీ పావులు కదుపుతోంది.
మరోవైపు నెల్లూరు నగర మేయర్ స్రవంతి తన పదవికి చేసిన రాజీనామాను జిల్లా కలెక్టర్ ఆమోదించారు. స్రవంతి రాజీనామా లేఖను తొలుత జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులకు నివేదించారు. అనంతరం కలెక్టర్ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నెల్లూరులోని 54 కార్పొరేషన్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఎస్టీ జనరల్ కేటగిరీలో భాగంగా ఆమె మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో ఆమె భర్త జయవర్ధన్ అవినీతి బాగోతం బట్టబయలయ్యాక అతను రెండు పర్యాయాలు జైలు జీవితం గడిపారు. ఆమె పదవి నాలుగేళ్లు పూర్తికావడంతో ఇటీవల అవిశ్వాసం పెడుతూ కార్పొరేటర్లు నోటీసులు ఇచ్చారు. ఆమెను పదవి నుంచి దించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 18న అవిశ్వాసం ప్రవేశ పెట్టేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో తాజాగా జరిగిన పరిణామాలతో మేయర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె కలెక్టర్‌కు పంపిన లేఖను ప్రభుత్వం ఆమోదించడంతో ఆమె శకం ముగిసినట్లయింది. కాగా, 18న జరగాల్సిన అవిశ్వాస సమావేశం సాధారణ సమావేశంగా జరుగుతుందని కార్పొరేషన్‌లోని కొందరు అధికారులు తెలిపారు. అయితే.. ఇప్పటికే కొత్త మేయర్ ఎవరనే అంశం పైన టీడీపీ ముఖ్య నేతలు చర్చలు చేసారు. నెల్లూరు ఎంపీతో పాటుగా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి కొత్త మేయర్ పైన తమ అభిప్రాయాలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ముందుగా మహిళా నేతకు అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనపైన చర్చ జరిగింది. అయితే.. మాజీ మంత్రి అనిల్ తో సహా వైసీపీ నేతలకు చెక్ పెట్టేందుకు రూప్ కుమార్ యాదవ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ముందుగా ఇన్ ఛార్జ్ మేయర్ గా ప్రకటించి.. ఆ తరువాత పూర్తి స్థాయి మేయర్ గా చేసే విధంగా ప్రణాళికలు సిద్దం అవుతున్నట్లు సమాచారం.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos