ఏపీలో పారిశ్రామిక ప్రగతి ఊపందుకుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమిస్తూ అనకాపల్లి జిల్లాలో మరో భారీ ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు అడుగు పడింది. రాంబిల్లి మండలం సీతపాలెం వద్ద ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో రూ.2,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న బ్లూ జెట్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్‌కు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇవాళ‌ భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 1,750 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి లోకేశ్‌కు కంపెనీ ప్రతినిధులు, కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి, పరిశ్రమ శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఔషధ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన బ్లూ జెట్ సంస్థ.. ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియట్లు, కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ తయారీ యూనిట్‌ను ఇక్కడ నెలకొల్పనుంది. ఇందుకోసం కూటమి ప్రభుత్వం 102.48 ఎకరాల భూమిని కేటాయించింది. మొత్తం మూడు దశల్లో ఈ ఫార్మా కంపెనీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు

ఈ పెట్టుబడితో అనకాపల్లి జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందనుందని, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయని, పెట్టుబడులకు ఏపీ స్వర్గధామంగా మారుతోందనడానికి ఈ శంకుస్థాపనే నిదర్శనమని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Related Videos