ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్లో చర్చించారు, గిరిజన ప్రాంతాల్లో ప్రధాన మంత్రి అవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ఐదేళ్లలో అసలు నిర్మించని గృహాలను రద్దు చేసే అంశంపైనా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పు చేర్పులపై చర్చించడంతో పాటు ఆయుర్వేద, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు లో ఆమోదం తెలిపారు.
డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించేందుకు ప్రతిపాదనపైనా చర్చించారు. ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ పాలసీ 4.0పై చర్చించి ఆమోదించారు. ఏపీ టెక్స్‌టైల్స్ గార్మెంట్ పాలసీ, ఏపీ మారిటైమ్ పాలసీలకు కూడా కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది.
జల్‌జీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ డీపీఆర్ స్థాయి దాటి ముందుకెళ్లట్లేదని అధికారుల్ని నిలదీశారు. ప్రాజెక్టును రాష్ట్రం సద్వినియోగం చేసుకోవట్లేదని దిల్లీలోనూ ప్రచారం నడుస్తోందని పవన్ తెలిపారు. బ్యూరోక్రసీ జాప్యంతో పథకం సద్వినియోగం కావట్లేదని సీఎం చంద్రబాబు అన్నారు. మిషన్ మోడ్‌లో పనిచేస్తే పథకం అద్భుత ఫలితాలిస్తుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. జేజేఎం (జల్ జీవన్ మిషన్) ప్రతి ఒక్కరికీ చేరువయ్యే అతిపెద్ద ప్రాజెక్టు అని లోకేశ్ తెలిపారు.
పథకాల సక్రమ వినియోగంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. పులివెందుల, ఉద్దానం, డోన్‌లో తాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలల పూర్తయిన దృష్ట్యా ఎవరెవరు ఏం చేశారో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మద్యం, ఇసుక మాఫియాను అరికట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. రేషన్ మాఫియాను అరికడుతున్నామని, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌తో రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన లుక్ పూర్తిగా మార్చేశారు. గత ఎన్నికలకు ముందు నుంచీ గుబురు గడ్డంతో దర్శనమిచ్చిన పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత తన లుక్ మార్చారు. పూర్తిగా గడ్డం తీసేసి గుబురు మీసంతో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఇవాళ కేబినెట్ భేటీకి వచ్చారు. దీంతో ఆయన కేబినెట్ సహచరులు కూడా ఆయన్ను ప్రత్యేకంగా చూశారు. తన తాజా చిత్రం హరిహర వీరమల్లు షూటింగ్ కారణంగా పవన్ ఈ లుక్ లోకి మారినట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos