ఏపీలో త్వరలో జరగాల్సిన విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నిక రద్దయింది. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్ధానానికి ఎన్నిక కోసం ఈసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. అయితే నోటిఫికేషన్ ఇచ్చే లోపే ఎన్నిక రద్దయిపోయింది. తాజాగా ఎమ్మెల్సీ రఘురాజు అనర్హత వేటుపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇందుకు కారణమైంది. దీని ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

వైసీపీ నుంచి విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన ఇందుకూరి రఘురాజు గతంలో ఎన్నికలకు ముందు టీడీపీకి దగ్గర కావడంతో ఆయనపై సొంత పార్టీ ఫిర్యాదు మేరకు మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు హడావిడిగా అనర్హత వేటు వేశారు. దీంతో విజయనగరం ఎమ్మెల్సీ స్ధానాన్ని ఖాళీ అయినట్లుగా ఈసీ నోటిఫై చేసింది. అయితే దీనిపై రఘురాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని తేల్చిచెప్పేసింది.

అయితే ఆ లోపే విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్ధానానికి ఉపఎన్నిక కోసం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే హైకోర్టు విజయనగరం ఎమ్మెల్సీ రఘురాజు అనర్హత వేటు చెల్లదని తీర్పు ఇవ్వడంతో ఆయన సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీంతో ఈసీ కూడా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. ఈ మేరకు ఇవాళ విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్ధానానికి జరగాల్సిన ఎన్నిక కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది.

Related Videos