అమరావతి : రాష్ట్రానికి ఆదాయాన్ని ఆర్జించే రెవెన్యూ ఎర్నింగ్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దే్శం చేశారు. రాజధానిలో చేపట్టే నిర్మాణాలు ఐకానిక్ గా ఉండటంతో పాటు తెలుగుదనం ఉట్టిపడేలా సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉండాలని సూచనలు చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 60వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. రాజధాని నిర్మాణంలో భాగంగా చేసిన వివిధ ప్రతిపాదనలకు సీఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదాన్ని తెలియచేసింది. అమరావతిని హరిత, నీలి నగరంగా, లివబుల్ సిటీగా నిర్మిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. బిట్స్ పిలానీ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల క్యాంపస్ లతో అమరావతి నగరం ఓ కీలకమైన విద్యా కేంద్రంగా నిలుస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయాలని.. నగరాన్ని విజయవాడతో అనుసంధానించేందుకు కృష్ణా నదిపై నిర్మించే బ్రిడ్జిని ఐకానిక్ గా నిర్మించాలన్నారు. ఏపీ గవర్నమెంటు కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా చేపట్టే అసెంబ్లీ లాంటి భవనాలను సందర్శించే వారికి అద్భుతమైన అనుభూతి కలిగేలా నిర్మాణాలు చేపట్టాలన్నారు. రాజధాని ప్రాంతంలో చేపట్టే ప్రతీ ప్రభుత్వ కార్యాలయం పూర్తిగా సద్వినియోగం కావటంతో పాటు వినూత్న డిజైన్లు ఉండాలని సూచనలు చేశారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రక్రియపై కార్యాచరణ మొదలు పెట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ఓ గ్రోత్ ఇంజన్ గా అమరావతి ఉండాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. రాజధాని ప్రాంతంలో వివిధ రంగాల్లో పెట్టుబడులతో పాటు ఆర్ధిక కార్యకలాపాల కేంద్రంగా మారాలన్నారు. రాజధానిలో నిర్మించే ఎత్తైన, ఐకానిక్ భవనాల నిర్మాణానికి సంబంధించి ఓ ప్రత్యేక ప్రణాళిక ఉండాలన్నారు. నవ నగరాలతో పాటు నగర విస్తరణకు సంబంధించి భవిష్యత్ ప్రణాళికలు కూడా ఉండాలన్నారు. బ్యాంకులు, ఆర్ధిక సంస్థలకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే స్థలాలు కేటాయించాన్నారు. నీరు, విద్యుత్ సరఫరా లాగే డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థ ద్వారా భవనాలకు చల్లదనం అందేందుకు అవసరమైన ప్రణాళికలు చేయాలన్నారు. నీరు, విద్యుత్, గ్యాస్ అవసరాలన్నీ ప్రజలకు డక్ట్ ల ద్వారా సరఫరా జరిగేలా చూడాలన్నారు.
60 వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో వివిధ అంశాలకు ఆమోదం..
అమరావతి క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి రూ.1208.41 కోట్లు వ్యయం చేసేందుకు పాలనానుమతి ఇచ్చేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. అమరావతి సచివాలయ, జీఏడీ, హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో ఫాసేడ్, గ్లేజింగ్, క్లాడింగ్ పనులు చేపట్టేందుకు గానూ రూ.2540 కోట్ల వ్యయం చేసేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ఏపీ శాసనసభ భవనంలో వివిధ సివిల్ స్ట్రక్చర్ పనులకు గానూ రూ.798 కోట్లను వ్యయం చేసేందుకు అథారిటీ ఆమోదం తెలియచేసింది. ఎల్పీఎస్ జోన్ 11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల లాంటి మౌలిక సదుపాయాలను చేపట్టేందుకు ఆమోద ముద్ర వేసింది. రాజధానిలో 220 కేవీ లైన్స్ రీరూటింగ్ చేసేందుకు కూడా అనుమతి మంజూరు చేసింది. 2వ దశ ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ, పెన్షన్ మంజూరు కోసం నిబంధనల్లో మార్పు చేసేందుకు అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. మెట్ట భూములకు ఎకరాకు రూ.40 వేల చొప్పున, జరీబుకు రూ.60 వేలకు కౌలును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రతీ ఏటా మెట్ట భూములకు రూ.3 వేల చొప్పున, జరీబు భూములకు రూ.5 వేల చొప్పున పదేళ్ల పాటు పెంపునకు ఆమోదం తెలిపింది. రాజధానిలో వివిధ సంస్థలకు భూములను కేటాయిస్తూ మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలియచేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెబీకి అమరావతి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో 1.78 ఎకరాల భూమిని కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. స్వామి నారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ఏర్పాటుకు వేర్వేరు చోట్ల 4.23 ఎకరాల భూమి కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. అత్యవసర సేవల విభాగం అగ్నిమాపక శాఖకు రాయపూడి వద్ద 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. డీఏవీ పాఠశాలకు నెక్కల్లు వద్ద వద్ద 3 ఎకరాలు, ఆప్కాబ్ కు రాయపూడి వద్ద 0.49 ఎకరాలను కేటాయించేందుకు ఆమోదం తెలియచేసింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos