వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను ఆయనతో పాటు సదరు కార్యక్రమ యాంకర్‌పై కూడా రాజమండ్రిలో కేసు నమోదైంది. హిందూ ఇతిహాసాలు, దేవతలు, భారత సైన్యంతో పాటు ఆంధ్రులను కించపరిచేలా వర్మ మాట్లాడారని ఆరోపిస్తూ ఈ ఫిర్యాదు దాఖలైంది. వివరాలు ఏమిటంటే .. రాజమండ్రికి చెందిన న్యాయవాది, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్.. రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా యాంకర్ కూడా ఉద్దేశపూర్వకంగానే వర్మను వివాదాస్పద ప్రశ్నలు అడిగి ప్రోత్సహించారని ఆరోపించారు. వర్మ చేస్తున్న ఇలాంటి పనుల వెనుక విదేశీ టెర్రరిస్టుల హస్తం ఉండవచ్చని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మేడా శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన త్రీ టౌన్ పోలీసులు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు సదరు యాంకర్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, గతంలో కూడా వర్మపై తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో పలు అంశాలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 

Related Videos