వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గుంటూరులోని మిర్చియార్డ్‌ను సందర్శించిన ఘటనపై ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దాన్ని ఉల్లంఘించి ఎలాంటి అనుమతి తీసుకుండానే భారీ జనసందోహంతో మిర్చియార్డును సందర్శించారు. దీనిపై ఎన్నికల సంఘం అధికారులు ఫిర్యాదు చేయడంతో... పోలీసులు స్పందించి జగన్ సహా ఏడుగురిపై కేసు పెట్టారు. ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగతున్న జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అక్కడ ఏం చేసినా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి. జగన్ పర్యటించిన గుంటూరులో కూడా కోడ్ అమలులో ఉంది. అయితే ఎన్నికల సంఘం అధికారుల అనుమతి తీసుకోకుండా జగన్ పర్యటించారు.
ఈసీ అనుమతి లేకుండా గుంటూరులో పర్యటించడాన్ని అధికారులు తప్పుపట్టారు. కోడ్ నియమాలను ఉల్లంఘించినందుకు జగన్‌పై అధికారులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు జగన్‌పై కేసు పెట్టారు. ఆయనతోపాటు వైసీపీ నేతలు కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపపాల్ రెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడుని కూడా నిందితుల లిస్ట్‌లో చేర్చారు.
జగన్‌తోపాటు వీళ్లంతా ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే కాకుండా అమలులో ఉన్న పోలీస్ యాక్ట్‌ను కూడా పట్టించుకోలేదని ఎన్నికల అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండానే కనీసం మిర్చి యార్డు సెక్రటరీ పర్మిషన్ కూడా తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వల్ల స్థానిక ప్రజలు, మిర్చి రైతులు ఇబ్బంది పడ్డారని, పెద్ద సంఖ్యలో వచ్చిన వైసీపీ నేతల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. ముందస్తు పర్మిషన్ తీసుకోకుండా వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టినందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపారు. కాగా ఈ కేసులో పేర్ని నానిని చేర్చడంపై వైసీపీ విమర్శలు చేస్తోంది. అసలు ఆ పర్యటనకు రాని పేర్ని నానిని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చారని ప్రశ్నించారు అంబటి రాంబాబు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన... దీన్నిబట్టి ప్రభుత్వం కుట్ర అర్థమవుతోందని మండిపడ్డారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos