ఏపీ రాజధాని అమరావతి పై వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రాజధానికి రూ 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు కేంద్రం సంసిద్దత వ్యక్తం చేసింది. ఇదే సమయంలో అమరావతికి రోడ్డు, రైలు కనెక్టివిటీ పైన కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశమైన వేళ అమరావతి కనెక్టివిటీ పైన కీలక హామీ దక్కింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా మొదటి రోజు బిజీగా గడిపిన చంద్రబాబు, ఈ రోజు కూడా వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమవేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. రాజధాని అమరావతికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ, అమరావతి - హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే, అమరావతి - రాయలసీమ జిల్లాల కనెక్టివిటీ సహా రాష్ట్రంలోని పలు ఇతర జాతీయ రహదారుల గురించి చర్చించారు.
కేవలం చర్చించడమే కాకుండా ఈ అంశాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రతిపాదనలను గడ్కరీకి సమర్పించారు. నిధుల కేటాయింపు తో పాటుగా రాజధాని నిర్మాణంలో భాగంగా కనెక్టివిటీ ఏర్పాటు పైన చర్చించారు. ఈ సమయంలో గడ్కరీ నుంచి చంద్రబాబుకు హామీ దక్కిందని సమాచారం. తన శాఖ నుంచి అమరావతికి పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందని గడ్కరీ చెప్పినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జాతీయ రహదారికి అమరావతి కనెక్టివిటీ దిశగా ఇప్పటికే చేసిన నిర్ణయాలు..అమలు ప్రతిపాదనల గురించి ఇద్దరూ చర్చించారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమార స్వామితో భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అంశం పైన చర్చించారు. సెయిల్ లో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విలీన ప్రతిపాదనల పైన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశం పైన ప్రధానితోనూ చంద్రబాబు చర్చించారు. చంద్రబాబు ఇంకా ఇవాళ రాత్రి పొద్దుపోయేదాకా కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో, కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ భేటీ కానున్నారు. అనంతరం తిరిగి ఏపీకి బయలుదేరి రానున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos