ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహా అన్ని శాఖల మంత్రులు ఇందులో పాల్గొన్నారు. రోజంతా సాగే సమావేశం ఇది. సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఈ భేటీని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.
రేపటితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుందని చంద్రబాబు గుర్తు చేశారు. అయిదు సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రం తిరోగమించిందని, అందుకే అప్పటి ప్రభుత్వాన్ని, పరిపాలనను ప్రజలు అంగీకరించలేదని అన్నారు. తమపై విశ్వాసం ఉంచి భారీ సంఖ్యలో 165 నియోజకవర్గాల్లో గెలిపించారని వ్యాఖ్యానించారు. 93 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించామని చెప్పారు.
ప్రతిసారీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఎదురవుతుంటుందని, ఇప్పుడు మాత్రం ఒకటి రెండు కాదని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నామని చంద్రబాబు అన్నారు. ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే వివిధ శాఖలపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని చంద్రబాబు గుర్తు చేశారు.
గత అయిదు సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అనేక వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, వాటన్నింటినీ గాడిలో పెట్టడానికే ప్రజలు అధికారం ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఏడు నెలల పరిపాలనలో అదే చేశామని వివరించారు. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, ఇతర స్పాన్సర్డ్ స్కీమ్‌లను అనుసంధానం చేసుకుంటున్నామని చంద్రబాబు వివరించారు. దాదాపుగా 90కి పైగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్‌లు ఉంటే వాటి నిధులన్నింటినీ కూడా గత ప్రభుత్వం మళ్లించిందని విమర్శించారు. ఇప్పుడు వాటన్నింటినీ సరి చేయాలనే ఉద్దేశంతో ప్రజలు తమకు అధికారాన్ని అప్పగించారని, అధికార యంత్రాంగంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos