కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం చుట్టూ ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది. టీటీడీ చైర్మన్ నియామకం మొదలుకొని, లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి వరకు అనేక అంశాలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పవిత్రతను తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, అది కోట్ల మంది నమ్మకమని అటువంటి చోట ఛైర్మన్ పదవిలో ఉండే, వ్యక్తికి అచంచలమైన భక్తి, నిబద్ధత, నిష్కలంకమైన వ్యక్తిత్వం ఉండాలని జగన్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడు నియామకం విషయంలో చంద్రబాబు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. జగన్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ లో ఒక కీలక విషయాన్ని లేవనెత్తారు. ఎన్నికలకు ముందే ఒక బాధిత మహిళ చంద్రబాబుకు లేఖ రాశారని, ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ తనను మోసం చేశారని ఆ లేఖలో పేర్కొన్నారని జగన్ తెలిపారు. ఆడవారి పట్ల ఆయన ప్రవర్తన సరిగా లేదని ఫిర్యాదు చేసినా, చంద్రబాబు దానిని ఏ మాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఒక బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తిగా చంద్రబాబు ఆ ఫిర్యాదుపై విచారణ చేయాల్సింది పోయి, ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తికే ఆ పవిత్రమైన పదవిని కట్టబెట్టడం దేవుడి పట్ల భయం లేకపోవడమేనని జగన్ దుయ్యబట్టారు.
గత కొంతకాలంగా తిరుమల లడ్డూలో వాడే నెయ్యి నాణ్యతపై స్పందిస్తున్న జగన్, తప్పు చేస్తున్నది చంద్రబాబు ప్రభుత్వమేనని ఎదురు దాడికి దిగారు. చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్ కొన్ని నెయ్యి ట్యాంకర్లను నాణ్యత లేవని వెనక్కి పంపిందని, కానీ అవే ట్యాంకర్లు వేరే పేర్లతో మళ్లీ టీటీడీకి వచ్చాయని, వాటిని అధికారులు అంగీకరించి లడ్డూ తయారీలో వాడారని జగన్ ఆరోపించారు. ఈ విషయాన్ని కేవలం తానే చెప్పడం లేదని, సీబీఐ- సిట్ వేసిన ఛార్జిషీట్ లో కూడా చాలా స్పష్టంగా ఉందని ఆయన గుర్తు చేశారు. మొదటి ఛార్జిషీట్ లోని 64, 91 పేజీల్లో, ఫైనల్ ఛార్జిషీట్ లోని 44వ పేజీలో ఈ వివరాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తన హయాంలో జరిగిన తప్పులను ఇతరుల పైకి నెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఇది ఆయన భక్తి లేని తనానికి నిదర్శనమని జగన్ విమర్శించారు.
నెయ్యి కొనుగోలు విషయంలో కూడా భారీ అవినీతి జరుగుతోందని జగన్ ఆరోపించారు. గణాంకాలను వివరిస్తూ... 2014-19, 2019-24 మధ్య నెయ్యి సగటు ధర సుమారు 278 నుంచి 330 రూపాయల మధ్యలో ఉందని ఆయన తెలిపారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన సొంత సంస్థ అయిన హెరిటేజ్ కు సంబంధించిన మానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ డెయిరీకి కిలో నెయ్యి 658 రూపాయల చొప్పున అమ్ముకునేలా 2025 వరకు కాంట్రాక్ట్ కట్టబెట్టారని జగన్ ఆరోపించారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేయడాన్ని చంద్రబాబు తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారని, భక్తుల నమ్మకాన్ని వ్యాపారంగా మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. పవిత్రమైన ఆలయాల నిర్వహణలో నిజాయితీ, నిష్ఠ ఉండాలని, కానీ చంద్రబాబుకు అవేవీ లేవని తన పోస్టులో విమర్శించారు జగన్.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos