ఏపీలో షెడ్యూల్ కులాలకు ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్ ను వర్గీకరించేందుకు ప్రభుత్వం సిధ్ధమవుతోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పును రాష్ట్రంలో అమలు చేసేందుకు ఉన్న మార్గాల్ని అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం అందులో భాగంగా తాజాగా దళిత నేత మందకృష్ణ మాదిగను కూడా పిలిపించి మాట్లాడింది. నిన్న హోంమంత్రి వంగలపూడి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఎస్సీ ప్రజాప్రతినిధులతో చంద్రబాబు సమావేశమై వర్గీకరణ ఎలా చేయాలో నిర్ణయించారు.
దీని ప్రకారం రాష్ట్రాన్ని, జోన్ ను, జిల్లాను ఒక్కో యూనిట్ గా తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకోసం త్వరలో ఓ కమిషన్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీని నివేదిక కూడా నెల రోజుల్లోపే అందించేలా టార్గెట్ పెట్టనున్నారు. డీఎస్సీతో పాటు ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో భాగంగా జనాభా ప్రాతిపదికన జిల్లా, జోనల్, రాష్ట్ర స్ధాయిలో పోస్టుల్ని విభజించనున్నారు.
కాగా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తాము అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ అమలు చేశామని...తరువాత న్యాయ సమస్య కారణంగా ఆ కార్యక్రమం నిలిచిపోయిందని సీఎం గుర్తు చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు వర్గీకరణను అమలు చేయడానికి సిద్ధమయ్యాయని...ఎవరికీ అన్యాయం జరగకుండా జిల్లా ఒక యూనిట్ గా వర్గీకరణ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సీఎం తెలిపారు.
మరోవైపు ప్రస్తుతం ఎస్సీలకు ఉన్న ఏబీసీడీ రిజర్వేషన్ల స్ధానంలో ఏబీసీ మాత్రమే కొనసాగించాలని దళిత ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబుకు సూచించారు. ఉపకులాలను ప్రధాన కులాల్లో చేర్చి రిజర్వేషన్ అమలు చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో ఎస్సీ జనాభా ఆధారంగానే రిజర్వేషన్ అమలుకు వారు పట్టుబట్టారు. ఎలాగో కమిషన్ ఏర్పాటు కాబోతోంది కాబట్టి అక్కడే ఈ విషయాలను తేల్చబోతున్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై దళితుల్లో విభజన కనిపిస్తున్న తరుణంలో ఈ వ్యవహారాన్ని సున్నితంగా డీల్ చేయకపోతే సమస్యకు పరిష్కారం దొరకడం కష్టమనే భావన వ్యక్తమవుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos