ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త లక్ష్యాలను ఫిక్స్ చేస్తు న్నారు. ఇందులో భాగంగా ఈ నెల 11, 12 తేదీల్లో కలెక్టర్ల సదస్సు నిర్వహించబోతున్నారు. ఈ సారి సదస్సులో గతం కంటే భిన్నంగా సీఎం చంద్రబాబు కీలక ఆవిష్కరణలకు సిద్దం అవుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు తుది దశకు చేరుకుంది. కావడానికి ఈ సదస్సు కలెక్టర్ల సదస్సే అయినా ... దీనిద్వారా ఎమ్మెల్యేలకు టాస్క్ ఫిక్స్ చేయబోతున్నారు. నియోజకవర్గాల వారీగా ఈ ప్రణాళికలు అమలు చేయాలని... ఇదే జరిగితే వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా ఇది కీలక మలుపు కానుందని అంటున్నారు.
ఈ సదస్సులో రాష్ట్రస్థాయి నుంచే కాకుండా జిల్లా, నియోజకవర్గ స్థాయి విజన్ డాక్యుమెంట్లను చంద్రబాబు ప్రకటించనున్నారు. వీటి అమలు పైన కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న శాఖల్లో ఈ ఆరు నెలల కాలంలో వచ్చిన మార్పు.. తీసుకురావాల్సిన మార్పుల పైన చర్చించనున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ తో పాటుగా సచివాలయాల సేవల ప్రక్షాళన పైన కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
గ్రామాల్లో సౌకర్యాల మెరుగుదల, సంక్షేమ పథకాల అమలు గురించి తొలి రోజు సదస్సులో కలెక్టర్లకు మార్గదర్శకం చేయనున్నారు. అదేవిధంగా అభివృద్ధి - సంక్షేమం పైన ఈ సమావేశంలో ప్రభుత్వం అధికారులకు దిశా నిర్దేశం చేయనుంది. రెండో రోజు సదస్సులో జిల్లా ఎస్పీలను భాగస్వాములను చేయనుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు, డ్రగ్స్ కట్టడి చర్యలు, బెల్టు షాపుల నియంత్రణ, ఉచిత ఇసుక పర్యవేక్షణ వంటి వాటి పైన సమీక్ష చేయనున్నారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పాల్గొని అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు మరింత పక్కాగా అమలయ్యేలా ఈ రెండు రోజుల సదస్సు ద్వారా ప్రభుత్వం కార్యాచరణ ఖరారు చేయనుంది. నియోజకవర్గాల విజన్ విడుదల చేయటం ద్వారా ఎమ్మెల్యేలు.. అధికారులు ఏకతాటిపై నిలిచి ఆ నిర్ణయాల అమలు కోసం ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో, రాజకీయంగానూ ఈ విజన్ ఆవిష్కరణ ఆసక్తికరంగా మారుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos