చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు. తన పర్యటన సందర్భంగా సీఎం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నియోజకవర్గం పరిధిలోని గుడుపల్లి మండలంలో గల అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో టీచర్ ట్రైనింగ్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు చంద్రబాబు. అనంతరం కుప్పం మున్సిపాలిటీలో ప్రభుత్వ గ్రంథాలయం, ఆదిత్య బిర్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. వీటితో పాటు కంగుందిలో కొత్తగా ఏర్పాటుచేసిన హెరిటేజ్ సైట్ డెవలప్‌మెంట్ వర్క్స్, బౌల్డరింగ్ పార్క్ ను చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే- 100 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను ఆయన ఆవిష్కరిస్తారు. శనివారం ఆయన గుడుపల్లి మండలం బెగ్గిలిపల్లి పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొొంటారు. అనంతరం శాంతిపురం మండలం తుమ్మసిలో జరిగే ప్రజా వేదిక సభకు హాజరవుతారు. టీడీపీ- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల గురించి వివరించనున్నారు. జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, పలువురు టీడీపీ నాయకులు దీనికి హాజరు కానున్నారు. ఈ-సైకిళ్ల పంపిణీకి చెందిన గిన్నిస్ ప్రపంచ రికార్డును అధికారికంగా ప్రకటించనున్నారు ఈ సభలోనే. ప్రభుత్వ కార్యక్రమాల ఎగ్జిబిషన్ స్టాళ్లను కూడా ఆయన సందర్శిస్తారు. ఫిబ్రవరి 1 ఆదివారం సీఎం తుమ్మసిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. దీంతో ఆయన మూడురోజుల కుప్పం పర్యటన ముగుస్తుంది. అనంతరం ఉండవల్లి నివాసానికి తిరుగు ప్రయాణమవుతారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసులకు సహకరించి అసౌకర్యాన్ని నివారించాలని కలెక్టర్ ప్రజలను కోరారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos