ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కేశినేని చిన్ని, కొలికపూడి శ్రీనివాస్ హాట్ టాపిక్ అయ్యారు. విజయవాడ ఎంపీ, ఆ పరిధిలోకి వచ్చే తిరువూరు అసెంబ్లీకి వీరిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ఇన్ చార్జ్ ను కాదని మరీ కొలికపూడికి టిక్కెట్ ఇప్పించారు కేశినేని నాని. ఆయనను గెలిపించడానికి గట్టి ప్రయత్నాలు చేశారు. గెలిచిన తర్వాత సీన్ మారిపోయింది. ఇద్దరూ మొదటి సారి గెలిచారు. కానీ ఆ గెలుపును ఆధారంగా చేసుకుని బలపడే ప్రయత్నాలు మాత్రం చేసుకోవడం చేత కాలేదు. ఎవరికి వారు వివాదాల్లోకి దిగిపోతున్నారు.
కొలికపూడి శ్రీనివాస్ పొలిటికల్ సైన్స్ పాఠాలు చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆయన రాజకీయాలు మాత్రం బేసిక్స్ తెలియని రాజకీయ నాయకుడిలా ఉంటాయి. తిరువూరులో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన .. కనీసం తన నియోజకవర్గ రాజకీయాల గురించి .. అక్కడి పొలిటికల్ డైనమిక్స్ గురించి పరిశీలన చేయుకుండా గుడ్డిగా రాజకీయం చేసి వివాదాల పాలయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు తన రాజకీయాన్ని మార్చుకోవాలని కానీ, కాస్త తగ్గి.. పరిస్థితిని చల్లబరుచుకుందామని కానీ ఆయన ఎప్పుడూ అనుకోలేదు. పార్టీ నాయకత్వం ఆయనకు మూడు, నాలుగు సార్లు చాన్సులిచ్చినా అదే పరిస్థితి కొనసాగుతోంది.
మరోవైపు కేశినేని చిన్నీ ఎదుగుదలకు టీడీపీ పెద్దలు ప్రోత్సహించారు. ఆ అవకాశాన్ని ఆయన అంది పుచ్చుకోవాల్సి ఉంది. కానీ ఆయనపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ నేతలతో ఆయనకు ఉన్న లింకులు తరచూ వివరాలు బయటకు వస్తున్నాయి. కొలికపూడికి చంద్రబాబు పిలిచి టిక్కెట్లు ఇచ్చారు. వీరిద్దరికి మొదటిసారి వచ్చిన అవకాశాలతోనే విజయం సాధించారు. అవకాశాలు మళ్లీ మళ్లీ రావన్న విషయం వీరికి తెలియదు. రాజకీయాలు ఒకరు నేర్పరు.. నేర్చుకునే శక్తి ఉంటేనే ఎక్కువ కాలం పాలిటిక్స్ లో ఉండగలుగుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇదిలా ఉండగా కొలికపూడి - చిన్ని విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన దుబాయ్ నుంచే పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసి, వివాదంలో ఉన్న నేతలతో మాట్లాడాల్సిన అవసరం లేదని, ఎవరినీ పార్టీ కార్యాలయానికి పిలవవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఇంత సీరియస్‌గా ఉన్న తరుణంలో, ఆయనే స్వయంగా జోక్యం చేసుకోవద్దని చెప్పిన తర్వాత ... ఎమ్మెల్యే కొలికపూడి.. పల్లా అపాయింట్‌మెంట్ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈరోజు పల్లా శ్రీనివాసరావుతో కొలికపూడి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలో, తాను ఎంపీ కేశినేనిపై ఎందుకు పోస్టులు పెట్టాల్సి వచ్చిందో వివరణ ఇచ్చేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. అధిస్ఠానం ఆదేశాలను మీరినట్లు కనిపించినా, తన వాదనను వినిపించాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, ముఖ్యమంత్రి వద్దన్న తర్వాత కూడా ఈ భేటీ జరగనుండటంతో ఈ వివాదం ఇక ఎటువైపు దారి తీస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos