ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. సంక్రాంతి నుంచి కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం డ్వాక్రా సంఘాలు ఎలా ఉన్నాయో అదే తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేసి వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు. డ్వాక్రా సంఘాలకు త్వరలోనే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ హోదా కల్పించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల రుణాలను ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే వ్యక్తి గత రుణాలను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్వాకాలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రామతీర్థంలో రాముడి తల తీసేస్తే ఎన్నికలు జరిగేవరకు దర్యాప్తు చేయలేదని, మూడు సింహాలను దొంగిలించినా స్పందన లేదన్నారు. అనంతపురంలో దేవుడి రథం తగలబెట్టి తెలుగుదేశం పార్టీమీద నెపం నెట్టారన్నారు. నేరస్తుల ఆటలు సాగనివ్వనని, ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకుంటామన్నారు. నేరస్తులు, రౌడీషీటర్ల భరతం పడతామని హెచ్చరించారు. 2027 నాటికి ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు అందిస్తామని, అందుకు కేంద్ర ప్రభుత్వ పథకం జల్ జీవన్ మిషన్ ను ఉపయోగించుకుంటామన్నారు.
బుడమేరు విజయవాడను ముంచేసినప్పుడు వరదల వల్ల వ్యాధులు రాకుండా అడ్డుకోగలిగామన్నారు చంద్రబాబు. వరద బాధితులను ఆదుకోవడానికి రూ.450 కోట్ల విరాళాలు వచ్చాయని, తాను చేసిన పనికి గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు ఒక మొక్కలు నాటాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos