ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీగా గడపనున్నారు. సీఐఐ - భారత పరిశ్రమల సమాఖ్య వార్షిక సమావేశంలో పాల్గొంటారు. ఇవాళ శుక్రవారం సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు హోటల్ తాజ్ ప్యాలెస్‌లో జరిగే సీఐఐ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇవాళ రాత్రి ఢిల్లీలోనే బసచేసి 31న ఏపీకి తిరిగి వస్తారని చెబుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముందని సమాచారం. వచ్చే నెల 21వ తేదీన విశాఖపట్నంలో జరిగే యోగా దినోత్సవం నిర్వహిస్తుండగా.. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. యోగా దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను వివరించడంతో పాటు వారిని కార్యక్రమానికి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. చంద్రబాబు వారం గ్యాప్‌లో రెండోసారి హస్తినలో పర్యటిస్తున్నారు.
ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు రేపు 31వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీతో పాటుగా బంగారు కుటుంబం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. కాట్రేనికోన మండలం చెయ్యేరులో ప్రభుత్వం, దాతలు, ప్రజల భాగస్వామ్యంతో 'పీ4' కార్యక్రమం మొదలవుతుంది. చెయ్యేరులోని సభా వేదిక దగ్గర మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.9 లక్షల 80 వేలతో చెరువు పూడికతీత పనులు జరుగుతున్నాయి.. ఈ పనులను కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తారు.
ముఖ్యమంత్రి సీహెచ్.గున్నేపల్లిలోని ఓఎన్జీసీ స్థలంలో హెలికాప్టర్‌లో దిగుతారని అధికారులు తెలిపారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో చెయ్యేరుకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. అలాగే పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం మొత్తం బిజీగా గడిపారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లి అక్కడి నుంచి కుప్పం వెళ్లి నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత నేరుగా కడపకు చేరుకుని మూడు రోజుల పాటు మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్లీ అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లి .. ఆ తర్వాత ముమ్మడివరం పర్యటనకు రాబోతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos