నిరుద్యోగులకు శాసన సభ వేదికగా శుభవార్త చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. త్వరలోనే 16 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలు, అభివృద్ధి చేయటం మా ఆలోచన అని .. ఓర్వకల్లు ను డ్రోన్ సిటీగా తయారు చేస్తామని అన్నారు. శాంతి భద్రతలను కాపాడుతామని, ప్రజలకు అవసరమైన సేవలు టెక్నాలజీ అనుసంధానంతో చేస్తామని, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ను తీసుకొస్తున్నామని, సోలార్ పేనెల్స్ పెడతామని, కరెంటు ఉచితంగా ఇచ్చేలా చేస్తామన్నారు. ఉద్యోగకల్పన మా విధానమని చాలా స్పష్టంగా చెప్పామని, అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదట సంతకం మెగా డీఎస్సీపై పెట్టామని చంద్రబాబు అన్నారు. ఈ మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. వీలైనంత త్వరగా 16,347 ఉగ్యోగాలు మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి ముందుకు వెళ్తామని అన్నారు చంద్రబాబు.
అదేవిధంగా తన 150 రోజుల పాలన గురించి విశ్లేషించారు చంద్రబాబు. రాష్ట్రం కష్టకాలంలో ఉన్న సమయంలో ప్రజలు పరిపక్వత ప్రదర్శించారని,. ఏపీ చరిత్రలో ఎప్పుడూ చూడని ప్రజాతీర్పు వచ్చిందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజల తిరుగుబాటు కనిపించిందని వ్యాఖ్యానించారు. సంక్షేమం ప్రారంభించిందే టీడీపీ అని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ రూ 4 వేలకు పెంచి అమలు చేస్తున్నామని, ఆదాయం బాగా ఉన్న రాష్ట్రాల కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఆర్దిక నిర్వహణలో చాలా అవకతవకలు జరిగాయని, గాడి తప్పిన పాలనను ఒక్కోటి సరి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, రాత్రికి రాత్రి ఏదీ జరిగిపోదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం వెంటిలేటర్‌పైకి వెళ్లిందని పేర్కొన్నారు. ఢిల్లీలో పరపతి పెరిగిందని చెప్పిన చంద్రబాబు..ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోందని అన్నారు. .గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎంత తవ్వితే అన్ని తప్పులు బయటపడుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు. పేదల కోసం అనేక సంస్కరణలు, పథకాలు తీసుకొచ్చామని, పేదలకు పక్కా ఇళ్లు నిర్మించిన ఘనత టీడీపీకే దక్కుతుందని చంద్రబాబు అన్నారు. టీడీపీ పాలనలో 120 సంక్షేమ పథకాలు ప్రారంభించామని, ఏపీలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తనకు ఉందని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో 101 అన్నా క్యాంటీన్‌లు నడుస్తున్నాయని, ఏపీలో బుక్ చేసుకున్న వారందరికీ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని వివరించారు. అమరావతికి పూర్వవైభవం తీసుకువస్తామని స్పష్టం చేశారు. పెట్టుబడులు ఆకర్షించడానికి చేయాల్సిన పనులు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు తయారు చేస్తామని, అమరావతితో పాటుగా రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos