కొత్త ఏడాది వేళ.. ఏపీ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ మంత్రివర్గ సమావేశంలో 14 అంశాల ఎజెండాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆంధ్రప్రదేశ్ రానుండగా.. ఆయన పర్యటనపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ప్రధాని మోదీ విశాఖలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక నరేంద్ర మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
ఇక మంత్రివర్గ భేటీలో ఆమోదించిన అంశాల విషయానికొస్తే... ప్రధానంగా అమరావతిలో రూ.2733 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదించింది. అమరావతిలో రెండు ఇంజనీరింగ్ కాలేజీల పనులకు, భవనాలు, లేఔట్‌ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ చేసిన సవరణ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోగా డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్న తీరుతెన్నుల తో పాటుగా ఆర్దికంగా ఎదురవుతున్న సమస్యల పైన చర్చ జరిగింది. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెవెన్యూ, ఫైనాన్స్, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రులతో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించారు.
అదేవిధంగా తిరుపతిలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు పెంపు ప్రతిపాదనకు కేబినెట్ అంగీకరించింది. పిఠాపురం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టులకు అనుమతి ఇచ్చింది. ఎస్‌ఐపీబీ ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 2,63,411 మందికి ఉద్యోగాలు కల్పించే అంశంపై చర్చించారు. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు చేస్తూ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి పైన పవన్ ప్రత్యేకంగా ఆరా తీయగా.. ఆర్దిక శాఖ ప్రస్తుత పరిస్థితుల పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos