కల్తీ మద్యం వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే.. నకిలీ మద్యం దందా టీడీపీ కీలక నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని అధికారులు తేల్చడం మరింత సంచలనంగా మారింది. దీంతో ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నిందితులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. నకిలీ మద్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అనంతరం కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు దాసరిపల్లి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్రలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వారిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస రావు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఈ నకిలీ మద్యం దందా వ్యవహారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో బట్టబయలైంది. టీడీపీ నేతలు కొంత మంది ముఠాగా ఏర్పడి అక్రమ మద్యం తయారు చేస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా చిన్నపాటి యంత్రాలతో పరిశ్రమ కూడా రహస్యంగా ఏర్పాటు చేశారు. పోలీసులు విషయం తెలుసుకుని రెయిడ్ చేసి ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ మద్యాన్ని బెల్టు షాపుల్లో అమ్ముతున్నట్లుగా గుర్తించారు. అయితే వైసీపీ హయాంలో ఇలా నకిలీ మద్యం తయారు చేయించి అమ్మడం అలవాటు అయిపోయింది. టీడీపీ వచ్చిన తర్వాత కూడా నేతలు అదే పని కొనసాగించారు. అధికార పార్టీ అనే ట్యాగ్ అడ్డం పెట్టుకుని బెల్టు దుకాణాల్లో అమ్మించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం వెంటే స్పందించింది. పోలీసులు చర్యలు తీసుకున్నారు. అరెస్టులు చేశారు. ఇతర చోట్ల ఎక్కడైనా ఇలాంటి డంపులు ఉన్నాయా అని సెర్చ్ చేస్తున్నారు.
రాష్ట్రం మొత్తం ఇలాంటి అక్రమ మద్యం డెన్‌లు, సారా డెన్‌లు ఏమైనా ఉంటే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి నిర్వీర్యం చేయనున్నారు. అక్రమాలు చేసే వారికికి టీడీపీ అనే ముద్ర లైసెన్స్ కానే కాదని పోలీసులకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇలా అక్రమ మద్యం వ్యాపారం వైసీపీ హయాం నుంచీ సాగుతుండటంతో ఎక్సైజ్ పోలీసులు సూత్రధారుల కోసం ఆరా తీస్తున్నారు. మద్యం విషయంలో చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు. గత ప్రభుత్వం అధికారికంగా జే బ్రాండ్ల పేరుతో నాసిరకం లిక్కర్ అమ్మింది. అలాంటి వాటికి చోటు లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే ... టీడీపీ నేతలే ఈ అక్రమ మద్యం దందా చేయడం నాయకత్వానికి సమస్యగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వైసీపీ హయాంలో అయితే.. మద్యం తయారీ, స్మగ్లింగ్ అనేది అప్పటి అధికార పార్టీ నేతలకు పెద్ద ఆదాయవనరుగా ఉండేది. ఇలాంటి వాటిని ఎప్పుడూ పట్టుకునేవారు కాదు. కేసినో ఆడుతూ దొరికితేనే.. పోలీసులు అది కేసినో కాదని వాదించారు. అలాంటి పరిస్థితుల పోలీసింగ్ నుంచి ఇపుడు టీడీపీ నేతలు అయినా సరే కఠినంగా చర్యలు తీసుకునే పోలీసింగ్ వచ్చింది. అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మరింత బాధ్యతగా ఉండాలన్న సంకేతాలను చంద్రబాబు పంపుతున్నారు. తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని నేరుగా చర్యలతో నిరూపిస్తున్నారని పలువురు పార్టీ నేతలు ప్రశంసిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos