ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా కర్నూలు విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సి.క్యాంపు రైతు బజారుకు చేరుకుని, అక్కడ కూరగాయల వ్యర్థాలను ఎరువుగా మార్చే ప్రక్రియను పరిశీలిస్తారు. రైతుబజారులోని రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం కేంద్రీయ విద్యాలయం సమీపంలో జైరాజ్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్క్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.
స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ధనలక్ష్మి నగర్ పార్కులో రూ.50 లక్షలతో అభివృద్ధి పనులకు గుర్తుగా పైలాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్రీయ విద్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. అలాగే పాణ్యం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు మాట్లాడతారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
కర్నూలులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు పలు ఆంక్షలు విధించారు. సీఎం చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను మళ్లించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు కర్నూలు పర్యటనకు 1700 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కర్నూల్ పర్యటన ముగిసిన తర్వాత సాయంత్రం 5:25 గంటలకు ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు తిరుగుపయనం కానున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos