పోలవరం జాతీయ ప్రాజెక్టును అక్టోబర్ 2026 కల్లా పూర్తి చేయాలని గడువు పెట్టినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు తాజా స్దితిని తెలుసుకునేందుకు ఇవాళ సీఎం చంద్రబాబు అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి.. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతో ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై అధికారుల నుంచి అంచనాలు తీసుకున్న చంద్రబాబు.. అప్పట్లో జరిగిన అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎలా పక్కదోవ పట్టిందో చంద్రబాబు గణాంకాలతో సహా వివరించారు.2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తాము ఎంతో శ్రమించామని చెబుతూ.. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ హయాంలో పనులు ఎలా ఆగిపోయాయో వివరించారు. గత ప్రభుత్వ హయాంలో వరదలకు డయాఫ్రమ్ వాల్ దారుణంగా డ్యామేజ్ అయిందని.. తమ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ తప్పిదాల సవరణకు విదేశీ నిపుణులను పిలిపించి చర్యలు తీసుకున్నామని తెలిపారు. అనంతరం అధికారులకు ఇచ్చిన గడువు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు ప్రకటించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos