మొంథా తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు సచివాలయంలోని ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రం నుంచి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి తుపాను పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం మొంథా తుపాను కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు సీఎంకు వివరించారు. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపు కదులుతోందని, రేపు రాత్రికి తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తుపాను ప్రభావంతో ఈ రోజు, రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతీ గంటకు తుపాను కదలికలను గమనిస్తూ, వర్షాలు, వరదలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పంట నష్టం జరగకుండా కాలువ గట్లను పటిష్టం చేయాలని స్పష్టం చేశారు. ప్రధాని కార్యాలయంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని మంత్రి నారా లోకేశ్‌కు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కాగా తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. తక్షణ సహాయక చర్యల కోసం రూ.19 కోట్లు విడుదల చేసింది. సంబంధిత అధికారులందరి సెలవులను రద్దు చేసి, విధులకు హాజరు కావాలని ఆదేశించింది. తీర ప్రాంతాల్లోని 57 మండలాల్లో 219 తుపాను పునరావాస కేంద్రాలను (షెల్టర్లు) సిద్ధం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన 62 మెకనైజ్డ్ బోట్లను వెనక్కి రప్పించే పనులు చేపట్టారు. తీర ప్రాంతాల్లో పర్యాటకుల రాకపోకలను పూర్తిగా నిషేధించారు.
ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సహాయక బృందాలను సిద్ధంగా ఉంచింది. 9 ఎస్డీఆర్‌ఎఫ్, 7 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. జిల్లాల్లో తాగునీరు, ఆహారం, సహాయ శిబిరాల ఏర్పాటు కోసం టీఆర్-27 కింద నిధులు మంజూరు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు ఎల్లుండి వరకు సెలవులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడప జిల్లాల్లో రేపటి వరకు, నెల్లూరు జిల్లాలో నేడు సెలవు ఇస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos