ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎనిమిది నెలల కూటమి ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అస్వస్థతకు గురైన పవన్ ను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు ఫోన్ చేస్తే డిప్యూటీ సీఎం అందుబాటులోకి రాలేదు. చంద్రబాబు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. పవన్ అటు దక్షిణ రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్ .. పవన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు.
మాజీ మంత్రి శైలజానాథ్ ఇటీవల వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పని చేసిన శైలజా నాథ్ తనకు వైసీపీలో అవకాశం ఇవ్వట పైన స్పందించారు. తనకు తొలి నుంచి వైఎస్ కుటుంబం అంటే అభిమానం ఉందని చెప్పుకొచ్చారు. ఎన్డీయే ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఎదురించడానికే వైఎస్సార్‌సీపీలో చేరినట్లు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, శాంతిభద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేసారు.
గత ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీలు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, వాటిని అమలు చేసే విషయాన్ని పట్టించుకోకుండా డిప్యూటీ సీఎం పవన్ యాత్రల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని శైలజనాథ్ ధ్వజమెత్తారు. హామీలు ఇచ్చే సమయంలో చంద్రబాబుకు రాష్ట్ర ఆర్దిక పరిస్థితి తెలియదా అని ప్రశ్నించారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం ఇవ్వడానికి చంద్రబాబు మనసుకు కష్టంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, క్షమాపణలు చెబితే సరిపోదని పేర్కొన్నారు. ఏపీలో శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలని శైలజానాథ్ చెప్పుకొచ్చారు. శైలజానాథ్ చేరికతో మరి కొందరు కాంగ్రెస్ సీనియర్లు.. నాడు వైఎస్సార్ తో కలిసి పని చేసిన నేతలు ఇప్పుడు వైసీపీలో ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos