అన్న క్యాంటీన్ల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆకలితో బాధపడే పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది కూటమి ప్రభుత్వం. కేవలం 5 రూపాయలకే భోజనం అందిస్తూ పేదల ఆకలి తీరుస్తోంది. ఈ మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్‌లు ఉండేలా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 113 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్‌లు విజయవంతంగా నడుస్తున్నాయి. మిగిలిన 62 నియోజకవర్గాల్లో కూడా వచ్చే జనవరి నుంచి వీటిని ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం కొత్తగా మరో 70 క్యాంటీన్లను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలకూ అన్న క్యాంటీన్‌లు విస్తరించనున్నాయి. ఈ 70 కొత్త క్యాంటీన్ల భవనాల నిర్మాణ పనులు సైతం ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. డిసెంబరు నాటికి వీటిని సిద్ధం చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఒక్కో క్యాంటీన్ భవనానికి రూ.61 లక్షలు చొప్పున మొత్తం రూ.41.70 కోట్లు ఖర్చు చేస్తున్నారు. జనవరి నుంచి ఈ కొత్త క్యాంటీన్‌లు అందుబాటులోకి వస్తాయి. కొత్తగా ప్రారంభించనున్న 70 క్యాంటీన్లతో ప్రభుత్వంపై ప్రజలకు అందించే భోజనంపై రాయితీ భారం.. ఏటా మరో రూ.45.07 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న 205 క్యాంటీన్లలో రోజూ మూడు పూటలా మొత్తం 1,84,500 మంది ఆహారం తీసుకుంటున్నారు. ఒక్కొక్కరిపై మూడు పూటలా కలిపి రాయితీ కింద సుమారు రూ.75 ఖర్చు చేస్తోంది. అల్పాహారంపై రూ.17, మధ్యాహ్నం భోజనంపై రూ.29, రాత్రి భోజనంపై మరో రూ.29 చొప్పున ప్రభుత్వం భరిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అన్న క్యాంటీన్లు ఎక్కువగా పట్టణ నియోజకవర్గాల పరిధిలోనే ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం వంటి నగరాల్లో 5 నుంచి 10 వరకు క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. దాంతో కొత్తగా కేటాయించిన 70 క్యాంటీన్లను ఎక్కువగా గ్రామీణ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్నారని అధికారులు వివరించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos