"ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చుతున్నాం. మా ప్రభుత్వం ప్రజలకు చేసిన వాగ్దానాలను ఒక్కటి కూడా మరచలేదు. ఈ సూపర్ సిక్స్ పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువస్తున్నాయని" డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అనంతపురంలోని ఇంద్రప్రస్థ మైదానంలో నిర్వహించిన 'సూపర్ సిక్స్ - సూపర్ హిట్' బహిరంగ సభలో ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ భారీ సభకు భారీగా ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.
ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం 15 నెలల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాయలసీమ అభివృద్ధి గురించి వివరించారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి గురించి ప్రత్యేకంగా మాట్లాడిన పవన్ కల్యాణ్, రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రాంతం ఎప్పటికీ వెనుకబడినది కాదని... మేము దీన్ని రత్నాల సీమగా మలిచి, ప్రజలకు సమృద్ధి, ఉపాధి అవకాశాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ లక్ష్యానికి పెట్టుబడులు ఆకర్షించడం, వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధి, నీటి సమస్యల పరిష్కారం మొదలైన కార్యక్రమాలపై దృష్టి సారించామన్నారు.
"ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందిస్తున్నామని, ఈ పథకం ద్వారా పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక భారం లేకుండా చికిత్స పొందుతారని పవన్ కళ్యాణ్ అన్నారు. మా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని మొదటి ప్రాధాన్యతగా పెట్టుకుందని, ప్రజలు కోరుకున్న పాలనే కూటమి ప్రభుత్వం అందిస్తోందని, యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. "యువత, మహిళలు, రైతులు భవిష్యత్ కోసమే సంక్షేమ పథకాలు. యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం, రైతులకు సబ్సిడీలు, నీటి సౌకర్యాలు అందిస్తున్నాం. ఈ పథకాలు రాబోయే తరాలకు శాశ్వత ప్రయోజనం కలిగిస్తాయని" పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
"రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించాం. ఈ సభల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి ప్రణాళికలు, ప్రజల సమస్యలు చర్చించి పరిష్కరిస్తున్నాం. పంచాయతీలకు ఎక్కువ నిధులు కేటాయించి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నాం" అని ఆయన తెలిపారు. "కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని ఆకుపచ్చగా చేస్తాం, వాతావరణ సమతుల్యతను కాపాడతాం. ప్రతి పౌరుడు ఈ ప్రయత్నంలో పాల్గొనాలని" పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos