ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథంలో నడిపించాలనే సంకల్పంతో ప్రభుత్వం దూసుకుపోతోంది . ఈ క్రమంలోనే రాష్ట్రానికి ఐటీ రంగానికి సంబంధించి విశాఖపట్నంలో కీలక ముందడుగు పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సేవల రంగంలో అగ్రగామిగా ఉన్న కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ.. విశాఖలో తమ తొలి పూర్తి స్థాయి ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి ఐటీ పెట్టుబడులు పెరగడమే కాకుండా.. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం కాగ్నిజెంట్ సంస్థ సుమారు రూ.1,582 కోట్లు పెట్టుబడికి సిద్ధంగా ఉందని సంస్థ ప్రతినిధులు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్‌కు తెలిపారు. మొదటి దశలోనే 8,000 మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో మరింత మందికి అవకాశాలు కల్పించే అవకాశముందని అంటున్నారు. కాగా ఇందుకు గాను కాపులుప్పాడ ప్రాంతంలో 21.31 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ క్యాంపస్ కోసం కేటాయించాలని కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు అంగీకారం తెలిపింది. పెట్టుబడులను ప్రోత్సహించడంలో భాగంగా ఈ భూమిని నామమాత్ర ధరకే.. అంటే ప్రతి ఎకరాను కేవలం 99 పైసలకే కేటాయించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని సమాచారం.
ఇక విశాఖలో నిర్మించనున్న ఈ క్యాంపస్, కాగ్నిజెంట్‌కు దేశంలోనే అత్యాధునిక వేదికలలో ఒకటిగా నిలవనుందని భావిస్తున్నారు. ఆఫీసు ప్రాంగణం నుంచి డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ టెక్నాలజీ సదుపాయాలు, ట్రైనింగ్ సెంటర్లు, ఉద్యోగులకు మౌలిక వసతుల వరకు అన్ని ఆధునిక వ్యవస్థలతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నట్టు చెబుతున్నారు. కేవలం ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాకుండా, స్థానిక యువతకు హైఎండ్ ఐటీ స్కిల్స్ నేర్పే కేంద్రంగా కూడా మారనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను రాష్ట్రంలోని ఇతర నగరాల్లో కూడా విస్తరించే అవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి, విజయవాడ, కర్నూలు వంటి ప్రాంతాల్లో సెకండ్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను డిజిటల్ డెస్టినేషన్‌గా మార్చాలన్న దిశగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కాగ్నిజెంట్ వంటి గ్లోబల్ కంపెనీలు రాష్ట్రాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టడమే మన రాష్ట్రానికి గౌరవమని అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos