మండుతున్న ఎండల నుంచి ఏపీ ప్రజలకు ఊరట కలిగే శుభవార్త వచ్చింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో ఏప్రిల్ 8 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మంగళవారం నుంచి మూడు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి వస్తారు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది.
నేడు ఉత్తరాంధ్రలో గరిష్టంగా 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానుండగా, రాయలసీమలో గరిష్టంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆదివారం కర్నూలు, ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, పల్నాడు జిల్లాలో పలుచోట్ల 40కి పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం నాడు రాయలసీమలో 41-43 డిగ్రీల ఉష్ణోగ్రత, ఉత్తరాంధ్రలో అయితే 39- 41 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
ఉత్తర, మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉన్న అల్పపీడన ద్రోణి నిన్న మరాఠ్వాడ నుండి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం, దక్షిణ కర్ణాటక దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో, మరో 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos