విశాఖపట్నంలో రుషికొండ భవన సముదాయాల వినియోగంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. ఇప్పటికే ఈ భవనాలను సందర్శించి, వాటిని ఎలా వినియోగించాలనే అంశంపై ఆరా తీశారు. వీటిని ప్రభుత్వ అధికారిక సమావేశాలు, ప్రోత్సాహక సదస్సులు, రాష్ట్ర/జాతీయ స్థాయి సమ్మిట్స్, ఇతర ప్రదర్శనల (MICE) కేంద్రంగా- అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికగా మార్చాలని ప్రతిపాదించారు.
ఈ ప్రతిపాదనలను త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేయనున్నారు. వచ్చే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోపు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ భవనాలను నిర్మించిన విషయం తెలిసిందే. దీనికోసం 453 కోట్ల రూపాయలను వ్యయం చేసింది. భారీ వ్యయంతో నిర్మించిన ఈ భవనాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన హయాంలో అధికారిక నివాసంగా, కార్యాలయంగా మార్చుకోవడానికి ప్రయత్నించారని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఇంటీరియర్ కోసమే 39 కోట్ల రూపాయలను దుబారాగా ఖర్చు చేశారని ఆరోపించారు.
ఈ పరిణామాల మధ్య- టీడీపీ కూటమి ప్రభుత్వం మరో ప్రధాన నిర్ణయాన్ని తీసుకుంది. రుషికొండ భవన సముదాయాలను ఎలా వినియోగించాలనే విషయంపై అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని వేసింది. భవనాల పరిశీలన, వినియోగంపై ఈ కమిటీ ప్రభుత్వానికి తన సిఫారసులను అందజేస్తుంది. ఈ కమిటీలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. ఆయా శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, పర్యాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos