గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపే విధంగా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇందుకోసం రూ.13.4 కోట్ల వ్యయంతో నిర్వహించిన లైడార్ సర్వే ఆధారంగా డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం విజయవాడ లోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో గోదావరి డెల్టా ఆధునీకరణపై ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, గోదావరి డెల్టా చీఫ్ ఇంజనీర్, సూపరింటెండింగ్ ఇంజనీర్, ఐఐఎస్‌సి టెక్నాలజీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
గోదావరి డెల్టా ఆధునీకరణలో భాగంగా ఇప్పటికే ఈస్ట్రన్ డెల్టాకు రూ.1,137 కోట్లు, సెంట్రల్ డెల్టాకు రూ.1,268 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. వెస్ట్రన్ డెల్టాకు సంబంధించిన అంచనాలను కూడా త్వరితగతిన సిద్ధం చేసి అందించాలని సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.
డెల్టా ఆధునీకరణలో కాలువలు, డ్రెయిన్లు, బండ్‌ల స్థాయి, డీసిల్టింగ్, లాకులు, షట్టర్లు తదితర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. పూడికతో నీటి ప్రవాహానికి ఆటంకంగా మారిన సీ మౌత్‌ల వద్ద డ్రెడ్జింగ్ పనులకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
గోదావరి దిగువ ప్రాంతాల్లోని ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, నరసాపురం, భీమవరం తదితర ప్రాంతాల్లో, సముద్రంలో కలిసే డ్రెయిన్లలో పేరుకుపోయిన పూడికను తొలగించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి నిమ్మల తెలిపారు.
బ్రిటీష్ కాలంలో నిర్మించిన పాత లాకులు, అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో వాటి మరమ్మతులు చేపట్టడం లేదా అవసరమైన చోట కొత్త నిర్మాణాలు చేపట్టడంపై సమగ్రంగా పరిశీలించాలని మంత్రి నిమ్మల అధికారులను ఆదేశించారు. లైడార్ సర్వే నిర్వహించిన ఐఐఎస్‌సి టెక్నాలజీస్ ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు, డీపీఆర్‌లు సిద్ధం చేసే సమయంలో స్థానిక సాగు నీటి సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధుల అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి నిమ్మల సూచించారు. స్థానికంగా ఉన్న సమస్యలు, నీటి ప్రవాహ మార్గాలు, ముంపు ప్రాంతాలు, డ్రెయిన్ల పరిస్థితిపై సాగు నీటి సంఘాలు, ప్రజాప్రతినిధులకు ఉన్న అనుభవాన్ని సాంకేతిక సమాచారంతో సమన్వయం చేసి సమగ్ర డీపీఆర్‌లు రూపొందించాలని మంత్రి తెలిపారు.
డీపీఆర్‌లు పూర్తయిన అనంతరం వాటిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. గోదావరి డెల్టా ఆధునీకరణ ద్వారా ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, సాగునీటి పారుదల వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos