కూటమిని విడగొడితేనే రాజకీయ భవిష్యత్ అని వైసీపీ గట్టి నమ్మకంతో ఉంది. పైస్థాయిలో అగ్రనేతలు అందరూ కలసిమెలిసి ఉంటున్నారు. వారి మధ్య విభేదాలు సృష్టించడం సాధ్యం కావడం లేదు. అందుకే జనసేన బలాన్ని తగ్గించేందుకు అంబటి రాంబాబు అస్త్రాన్ని ప్రయోగించింది వైసీపీ. కాపు వర్గంలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీ తన కుట్ర రాజకీయాల అమలుకు ప్లాన్ చేసింది. స్థానిక ఎన్నికల్లో మూడు పార్టీల క్యాడర్ ఏకాభిప్రాయంతో ఉండటం కష్టమని.. ఇలాంటి సమయంలో ఆ పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి కావాల్సినంత సరుకు లభిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపైనే వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అగ్రస్థాయి నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య సయోధ్య బలంగా ఉండటంతో, వారిని విడదీయడం సాధ్యం కాదని గ్రహించిన వైసీపీ.. ఇప్పుడు తన వ్యూహాన్ని క్షేత్రస్థాయికి మళ్లించింది. కూటమికి ప్రధాన బలంగా ఉన్న జనసేన ఓటు బ్యాంక్, ముఖ్యంగా కాపు సామాజికవర్గంలో గందరగోళం సృష్టించే బాధ్యతను వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు భుజానికెత్తుకున్నారు. పవన్ కళ్యాణ్ తన సామాజికవర్గాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టారనే పాత విమర్శకు కొత్త పదును పెడుతూ, కాపు వర్గంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. జనసేన బలం తగ్గితే తప్ప తమకు భవిష్యత్తు లేదని భావిస్తున్న వైసీపీ, సామాజిక సమీకరణాల ద్వారా కూటమి పునాదులను కదిలించే పనిలో పడింది.
వైసీపీకి త్వరలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఒక గొప్ప అవకాశంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నాయకులు సర్దుకుపోయినట్లుగా, స్థానిక ఎన్నికల్లో గ్రామ స్థాయి క్యాడర్ సర్దుకుపోవడం దాదాపు అసాధ్యమని ఆ పార్టీ భావిస్తోంది. ప్రతి ఊరిలోనూ మూడు పార్టీలకు చెందిన ఆశావహులు ఉంటారు. సీట్ల కేటాయింపు దగ్గర మొదలయ్యే అసంతృప్తిని క్యాష్ చేసుకోవడమే వైసీపీ అసలు ప్లాన్. ఎక్కడైతే కూటమిలో విభేదాలు వస్తాయో, అక్కడ తటస్థులను లేదా అసంతృప్త నేతలను ప్రోత్సహించడం ద్వారా చిచ్చు పెట్టాలని వైసీపీ భావిస్తోంది. వైసీపీకి ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలిచామన్న దానికంటే, కూటమి పార్టీల మధ్య ఎంత దూరం పెంచామన్నదే ప్రధానం. "కూటమిలో ఏకాభిప్రాయం లేదు అనే ముద్ర వేయగలిగితే, అది వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పెద్ద చీలికకు దారితీస్తుందని వారి నమ్మకం. క్యాడర్ స్థాయిలో గొడవలు మొదలైతే, అవి సహజంగానే పైస్థాయి నేతలపై ఒత్తిడి పెంచుతాయని ఆ పార్టీ గట్టి నమ్మకంతో ఉంది.
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు, స్థానిక సీట్ల కోసం మూడు పార్టీల కార్యకర్తలు పోటీ పడుతున్నారు. అందరికీ అవకాశాలు కల్పించడం ఏ ప్రభుత్వానికైనా కష్టసాధ్యమైన పని. ఈ డిమాండ్ అండ్ సప్లై గ్యాప్‌ను వైసీపీ తన అనుకూలతగా మార్చుకోనుంది. కూటమి నేతల మధ్య ఈగో సమస్యలను రాజేయడం, ఒక పార్టీకి దక్కిన ప్రాధాన్యత మరో పార్టీకి దక్కలేదని ప్రచారం చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో కూటమి ఐక్యతను దెబ్బతీయడమే వైసీపీ ప్రస్తుత రాజకీయ ఎజెండా. వైసీపీకి ఇప్పుడు కావాల్సింది స్వంత బలం పెంచుకోవడం కంటే, శత్రువుల మధ్య బలహీనతను వెతకడమే. స్థానిక ఎన్నికల్లో గెలవడం ద్వారా వచ్చే ఫలితం కంటే, కూటమి పార్టీల మధ్య శాశ్వత పగను సృష్టించడమే వైసీపీ సాధించాలనుకుంటున్న అసలైన గెలుపు. చంద్రబాబు రాజకీయ చాణక్యం, పవన్ కళ్యాణ్ అంకితభావం ఈ వ్యూహాలను ఎలా తిప్పికొడతాయో మరి వేచి చూడాల్సిందే.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos