వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు షాక్ ఇచ్చింది. నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్ విధించడంతో పోలీసులు గుంటూరు జిల్లాకు తరలిస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో తెదేపా కార్యకర్త రాజుపై దాడి చేసిన కేసులో ఆదివారం ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టులో హాజరుపరచడానికి ముందు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నందిగం సురేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, మధుమేహం స్థాయులను పరీక్షించారు.
సురేశ్‌ను కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టు ప్రాంగణంలో ఇతరులను ఖాళీ చేయించారు. ఆయన అనుచరులు భారీగా చేరుకోవడంతో వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. కాగా నిన్న ఆదివారం నందిగం సురేష్ అరెస్ట్ చేసిన సమయంలో.. ఆయన భార్య బేబీ లత తీవ్రంగా స్పందించారు. పోలీసు స్టేషన్ వద్ద పోలీసులతో బేబీ లత వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన భర్తను ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇక, రాజధాని గ్రామమైన ఉద్దండరాయుని పాలెంకు చెందిన రాజుపై దాడి జరిగినట్టుగా అతని భార్య చైతన్య లక్ష్మీ పోలీసులను ఆశ్రయించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ తన భర్త రాజుపై దాడి చేశారని చైతన్య లక్ష్మి అనే మహిళ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భర్తపై వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగాం సురేష్, అతని సోదరుడు శనివారం అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. నందిగం సురేష్, అతడి అనుచరుల దాడిలో గాయపడిన రాజును మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించినట్టుగా చెబుతున్నారు. రాజు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు నందిగం సురేష్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చడంతో న్యాయస్థానం జూన్ 2 వరకు రిమాండ్ విధించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos